విచారణ లోపభూయిష్టంగా సాగుతోంది
కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలి
కాపు, బలిజ సంఘాల జేఏసీ డిమాండ్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కాపు సామాజిక వర్గానికి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసును నీరు గార్చే యత్నాలు జరుగుతున్నాయని కాపు, బలిజ సంఘాల జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. విచారణ లోపభూయిష్టంగా సాగుతోందని, సాక్ష్యాలు సక్రమంగా సేకరించడం లేదని ఆరోపించింది. లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రకటించిన ఆర్థిక సాయాన్ని పెంచడంతోపాటు జు్యడీషియల్ లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. శుక్రవారం విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ హాలులో నిర్వహించిన కాపు, బలిజ సంఘాల ఆత్మీయ సమావేశంలో రాష్ట్రంలో కాపులపై జరుగుతున్న దాడులు, కార్యాచరణపై జేఏసీ నేతలు చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకుడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన హరిచంద్రప్రసాద్ వల్ల తనకు ప్రాణ హాని ఉందని లక్ష్మీనాయుడు గుడ్లూరు పోలీసులకు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో హరిచంద్ర ప్రసాద్ తన కారుతో తొక్కించి అతి దారుణంగా హత్య చేశాడన్నారు. అక్టోబర్ 2న ఘటన జరిగితే పది రోజుల వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు. కాపు, బలిజ సంఘాల నేతలు అక్కడికి వెళ్లి నిలదీస్తే నామమాత్రంగా కేసు నమోదు చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే రూ.50 లక్షలు తీసుకుని ఓ మంత్రి ద్వారా కేసును నీరు గార్చే యత్నం చేస్తున్నారని జేఏసీ నేత ఆమంచి స్వాములు ఆరోపించారు.
హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నాలు చేశారన్నారు. కాపు, బలిజ సంఘాల ఆందోళన వల్లే లక్ష్మీనాయుడు హత్య వెలుగులోకి వచ్చిందన్నారు. ఎవరి తాత సొమ్ము అని ఆర్థిక సాయం చేస్తున్నారంటూ రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య జరిగితే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, బ్రాహ్మణి ఆయన ఇంటికి వెళ్లి రూ.కోటి ఆర్థిక సహాయం చేసిన విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. కుల రాజకీయాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని జేఏసీ నేత దాసరి రాము పేర్కొన్నారు.
హత్య జరిగిన పది రోజులకు కూడా ప్రభుత్వం పట్టించుకోనందు వల్లే తాము వెళ్లాల్సి వచ్చిందన్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలనే తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. మానవీయ కోణంలోనే పరిహారం పెంచాలని కోరుతున్నట్లు చెప్పారు. వీరయ్య చౌదరి కుటుంబానికి రూ.కోటి ఇస్తే ఆ రోజు మీ నోరు పడిపోయిందా? అని నిలదీశారు. లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాపు సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.


