నిజమైన సం.. క్రాంతి!

Laxmipur Farmers' Cooperative Society Success Story - Sakshi

సం..క్రాంతి.. పండుగ కాంతి.. మట్టి పిసికే రైతు ఒంటరిగా ఉంటే విఫణిలో బేలగా నిలబడాల్సి వస్తుంది.. వ్యాపారుల నిలువు దోపిడీకి గురవ్వాల్సి వస్తుంది.. విత్తనాలు, ఎరువులు వ్యాపా రులు చెప్పిన (చిల్లర) ధరకు కొనాల్సి వస్తుంది.. దళారులు చెప్పిన (టోకు) ధరకే పంటను తెగనమ్మాల్సి వస్తుంది...! అటువంటి రైతులే, చేయీ చేయీ కలిపితే మహత్తర శక్తిగా మారొచ్చని జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌ రైతన్నలు రుజువు చేశారు. ఐకమత్యంతో కదులుతూ చరిత్రను తిరగరాస్తున్నారు. పెద్ద పండుగ వేళ లక్ష్మీపూర్‌ రైతన్నల ఆచరణ నుంచి మనమూ స్ఫూర్తి పొందుదాం.. ఒక్కతాటిపైకి వచ్చిన అన్నదాతలకు నిండు మనసుతో శుభాకాంక్షలు చెబుదాం..

లక్ష్మీపూర్‌ రైతులు రాజకీయాలకు అతీతంగా చేయి చేయి కలిపి.. సమష్టి శక్తిగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఓ చిన్న గ్రామం లక్ష్మీపూర్‌. తొలుత సహకార సంఘంగా ఏర్పడిన రైతులు అనతి కాలంలోనే ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీని కూడా ఏర్పాటు చేసుకుని శభాష్‌ అనిపించుకుంటున్నారు. లక్ష్మీపూర్‌ సొసైటీ 2016 డిసెంబర్‌లో రిజిస్టరైంది. సొసైటీ కన్నా మెరుగైన ప్రయోజనాల కోసం లక్ష్మీపూర్‌ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ (ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ)ని రైతులు నాబార్డ్‌ తోడ్పాటుతో సెప్టెంబర్‌ 2018లో రిజిస్టర్‌ చేసుకున్నారు.

ఈ కంపెనీకి కేంద్ర వాణిజ్య శాఖ గుర్తింపు కూడా ఇటీవలే లభించింది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలను, రాయితీలను, రుణాలను అందుకోవడానికి.. తమ ఉత్పత్తులను దేశ విదేశాల్లో ఎక్కడైనా అమ్ముకోవడానికి లక్ష్మీపూర్‌ రైతులకు ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ ద్వారా అవకాశం ఏర్పడింది. సంఘ సభ్యులందరికీ ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా ఒకే చోట విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను తక్కువ ధరకే సంఘం రైతులకు అందుబాటులో ఉంచుతున్నది. ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు సైతం నేరుగా సంఘానికి వస్తాయి. దీనివల్ల రైతులకు రవాణా భారం, ఖర్చులు తగ్గాయి.

వరి, పసుపు, మొక్కజొన్న, నువ్వులు..
ఆ గ్రామంలో 90 శాతం రైతు కుటుంబాలే. దాదాపు 8 వేల జనాభా. వ్యవసాయాన్ని కష్టంగా కాకుండా ఇష్టపడి చేస్తూ, ప్రతి పంటలోను తోటి గ్రామాల రైతుల కంటే అధిక దిగుబడులు సాధిస్తుంటారు. వరి, పసుపు, మొక్కజొన్న, నువ్వులు, టమాటోలు తదితర కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. వేరుశెనగ, కంది పంటలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ప్రతి భూమిలో కనీసం రెండు, మూడు పంటలు పండిస్తారు. ఎన్నికలప్పుడు ఎవరి పార్టీ వారిదే. ఎన్నికలయ్యాక మాత్రం అందరూ ఒక్కటిగా మెలుగుతున్నారు. ఒకప్పుడు అందరు రైతుల మాదిరిగానే ఆ రైతులు పంట అమ్ముకునేందుకు నానా ఇబ్బందులు పడేవారు. అటువంటి పరిస్థితుల్లో రిటైర్డ్‌ ఎ.డి. అశోక్‌కుమార్‌ తోడై, రైతుల ఐకమత్యంతో ఏమేమి సాధించవచ్చో నూరిపోశారు. ఈ నేపథ్యంలో నుంచి పుట్టుకొచ్చిందే లక్ష్షీ్మపూర్‌ రైతుల పరస్పర సహకార సంఘం.

సభ్యత్వ రుసుము రూ. 3,500
తొలుత ఐదుగురు సభ్యులు సహకార సంఘానికి బీజం వేశారు. వారి ఆలోచనలు నచ్చిన గ్రామంలోని రైతులందరు సంఘంలో సభ్యులైనారు. కేవలం నెలలోపే, ఎవరి ప్రమేయం లేకుండా 312 మంది రైతులు సభ్యులుగా చేరడం రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా చెపుతుంటారు. రెండెకరాల రైతుకు అప్పట్లో సభ్యత్వ రుసుము రూ. 2,300 ఉండేది, ప్రస్తుతం రూ. 3,500కు పెరిగింది. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించి, మూడు నెలలకొకసారి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. సంఘం చైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులను ప్రతి రెండేళ్ల కొకసారి ఎన్నుకుంటారు. వీరు సంఘం నిర్మాణం, పటిష్టత, వ్యాపారాలపై ప్రతి 15 రోజులకొకసారి సమావేశమవుతుంటారు. చైర్మన్‌ సహా ప్రతి సభ్యుడూ సంఘ నియమాలకు కట్టుబడి ఉంటామని సభ్యులందరి ముందు ప్రమాణం చేస్తారు.

ప్రభుత్వ నిబంధనలతో పాటు సంఘానికి ప్రత్యేక నిబంధనలు రాసుకుని ముందుకు వెళ్తుండటంతో సొసైటీ విజయపథాన నడుస్తోంది. సర్వసభ్య సమావేశానికి రాకపోతే రూ. 500 జరిమానా, సంఘ డైరెక్టర్లు సమావేశానికి వెళ్లకపోతే రూ. 100 జరిమానా విధిస్తుంటారు. దీంతో, ప్రతి సమావేశానికి సభ్యులందరూ వచ్చి తమకు తోచిన సలహాలు, సూచనలు ఇస్తుంటారు.  ఈ నేపథ్యంలో సంఘానికి ఆదాయం తెస్తూనే, సంఘ సభ్యుడైన రైతులకు లాభం ఉండేలా తొలుత ‘లక్ష్షీ్మపూర్‌ రైస్‌’ను తెర మీదకు తెచ్చి, సఫలీకృతులయ్యారు. ఆ కోవలోనే గ్రామ రైతులు పండించిన విత్తనాన్ని తోటి రైతులకు అందించాలనే ఆకాంక్షతో ‘లక్ష్మీపూర్‌ సీడ్‌’ను అమ్ముతున్నారు. ఇదే వరుసలో తాజాగా ‘లక్ష్మీపూర్‌ నువ్వుల’ను సైతం మార్కెట్లోకి తీసుకువచ్చారు.

క్వింటాలుకు రూ. వెయ్యి అదనపు రాబడి
గ్రామంలో ఎక్కువగా బీపీటీ, హెచ్‌ఎంటీ, జై శ్రీరాం వరి రకాలను సాగు చేస్తుంటారు. ఈ గ్రామస్తులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తుండటంతో, ఎకరాకు 28–30 క్వింటాళ్ల దిగుబడి తీస్తుంటారు. రైతులు ఎవరికివారే వరి ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, గ్రామంలోని మిల్లులో మర ఆడిస్తారు. అప్పుడు సంఘ ప్రతినిధి బృందం పరిశీలించి, బాగున్నాయనుకుంటేనే సంఘం తీసుకుని, గోదాములో నిల్వ చేస్తుంది.

మార్కెట్‌ రేటు కంటే తక్కువకే  నేరుగా వినియోగదారులకు అమ్ముతుంటారు. బియ్యం అమ్మగా వచ్చిన డబ్బులో కొంత సంఘానికి జమ చేసి, మిగతా డబ్బులను వెంటనే రైతులకు చెల్లిస్తుంటారు. దీని వల్ల గ్రామంలోని రైతులందరూ సన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చుతుండటంతో, ధాన్యాన్ని అమ్మిన దాని కంటే, బియ్యం అమ్మగా రైతులకు క్వింటాల్‌కు అదనంగా రూ. 500 నుంచి వెయ్యి వరకు లాభపడుతున్నారు.

లక్ష్మిపూర్‌ సీడ్‌కు ఆదరణ
గ్రామ రైతులు ప్రతి సీజన్‌లో లక్షల రూపాయలు పెట్టి రక రకాల కంపెనీల వరి విత్తనాన్ని తీసుకువచ్చి పంటే వేసేవారు. కానీ, విత్తనాల్లో నాణ్యత లేకపోవడం వల్ల పంట దిగుబడులు వచ్చేవి కాదు. దీంతో, రైతులందరం కలిసి మన విత్తనాన్ని మనమే తయారు చేసుకోవడం కాదు, తోటి రైతులకు కూడా అందించాలని లక్ష్షీ్మపూర్‌ సీడ్‌ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. పొలాస పరిశోధనా స్థానం నుంచి వరిలో కొత్త దొడ్డు రకం జెజిఎల్‌–24423ని దాదాపు 1000 ఎకరాల్లో సాగు చేసి, ఆ విత్తనాన్ని తోటి రైతులకు అమ్ముతున్నారు.

వీటితో పాటు ఐఆర్‌–64, బతుకమ్మ, ఎంటియు–1010 రకాలను కూడా విక్రయిస్తున్నారు. విత్తన రైతులకు మార్కెట్‌ ధర కంటే రూ. 200 వరకు ఎక్కువ ధర వస్తున్నది.   లక్ష్మీపూర్‌ రైతులు పసుపు పంట తర్వాత నువ్వులు వేస్తుంటారు. గ్రామంలో దాదాపు వెయ్యి క్వింటాళ్ల వరకు నువ్వులు పండుతాయి. నువ్వులు నాణ్యంగా ఉన్నప్పటికీ, దళారులు రంగ ప్రవేశం చేసి కిలో రూ 70–100 వరకు కొనుగోలు చేసేవారు. దీంతో, రైతులకు సరైన ఆదాయం రాక నష్టపోతుండేవారు. సీడ్స్, రైస్‌తో లక్ష్మీపూర్‌కు బ్రాండ్‌ ఇమేజ్‌ వచ్చినందున, నువ్వులను సైతం విక్రయిస్తున్నారు. ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారు.

లక్ష్మీపూర్‌ రైతులు ఐకమత్యంతో చేస్తున్న ప్రతి పనికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ తోడ్పాటునిస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ చొరవ వల్ల గ్రామంలో రూ. 4 కోట్లతో విత్తన శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటైంది. సంఘ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న చైర్మన్‌ తిరుపతి రెడ్డి రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. 2017లో రూ. 11 లక్షల బియ్యం, రూ. 8 లక్షల వరి విత్తనాలు, 2018లో రూ. 14 లక్షల బియ్యం, రూ. 8 లక్షల వరి విత్తనాలు అమ్మారు. 

సంఘం ప్రారంభించిన రెండేళ్లలోనే దాదాపు రూ. 4 కోట్ల టర్నోవర్‌తో శభాష్‌ అనిపించుకుంటున్నారు. రైతులు పండించే కూరగాయల అమ్మకానికి లక్ష్మీపూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంఘటితం కావడం వల్ల రైతులు అధికాదాయం పొందుతున్నారు. సరసమైన ధరకు నాణ్యమైన వ్యవసాయోత్పత్తులు దొరుకుతుండటంతో వినియోగదారులూ సంతోషపడుతున్నారు.
(వివరాలకు.. సంఘ ప్రతినిధులు మోహన్‌ రెడ్డి(95020 26069), రాంరెడ్డి(99484 52429)

పంట పండించిన ప్రతి రైతూ లాభపడాలి
పంట పండించిన ప్రతి రైతూ లాభపడాలన్నదే మా సంఘం ప్రధాన ఉద్దేశం. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటూనే సంఘాన్ని ముందుకు తీసుకెళుతున్నాం. యువ రైతులను, ఖాళీగా ఉండే వెనుకటి పెద్ద మనుషులను సంఘ సలహాదారులు నియమించుకుంటున్నాం. రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను ఒక చోట అందిస్తూనే, ముఖ్యంగా రైతులు పండించిన ప్రతి పంటను ఎలా మార్కెటింగ్‌ చేయాలన్న దానిపైనే చర్చిస్తున్నాం. అదే మాదిరిగా వినియోగదారులకు సైతం తక్కువ ధరలో ఉత్పత్తులు అందేందుకు ప్రయత్నిస్తున్నాం.

– పన్నాల తిరుపతి రెడ్డి, చైర్మన్‌(93915 28529), లక్ష్మీపూర్‌ రైతుల సహకార సంఘం, జగిత్యాల జిల్లా

సంకల్ప బలమే సక్సెస్‌కు కారణం  
లక్ష్మీపూర్‌ సొసైటీ రైతు లోకానికి మార్గదర్శిగా మారింది. ఇక్కడి రైతులు రాజకీయాలను పక్కన పెట్టి ముందుకు వెళ్తుండటంతో, చాలా గ్రామాల రైతులు సైతం లక్ష్మీపూర్‌ రైస్‌ మాదిరిగా ఆయా గ్రామాల పేర్లతో రైస్‌ విక్రయించడం జరుగుతుంది. ఇక్కడి రైతుల్లో సంకల్పం, పట్టుదల, విజయం సాధిస్తామన్న నమ్మకం మెండుగా ఉంది. అందువల్లే ప్రతి పనిలోనూ సక్సెస్‌ కాగలుగుతున్నారు.

– అశోక్‌కుమార్‌ (85004 28578), జిల్లా వ్యవసాయ శాఖ సలహాదారు, జగిత్యాల


∙‘లక్ష్మీపూర్‌ నువ్వుల’ను మార్కెట్లోకి విడుదల చేస్తున్న జిల్లా కలెక్టర్‌ శరత్‌


నువ్వులు విక్రయిస్తున్న సంఘ సభ్యులు

– పన్నాల కమలాకర్, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top