వనపర్తిలోని మోజర్ల వర్సిటీలో ఏరోపోనిక్ విధానంలో ప్రయోగాత్మకంగా పంట సాగు
తెలంగాణలో కూడా కుంకుమ పువ్వు సాగు చేయొచ్చు : వీసీ రాజిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కుంకుమ పువ్వు సాగు తెలంగాణలో కూడా సాధ్యమని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం నిరూపించింది. నాబార్డు ఆర్థిక సాయంతో ఏరోపోనిక్ పద్ధతిలో వనపర్తి జిల్లాలోని మోజర్ల ఉద్యాన కళాశాలలో ప్రొఫెసర్ పిడిగం సైదయ్య నేతృత్వంలో ప్రయోగాత్మకంగా కుంకుమ పువ్వును సాగు చేశారు. అతిశీతల వాతావరణంలో మాత్రమే ఈ కుంకుమ పువ్వు సాగవుతోంది.
కశ్మీర్ తరహా వాతావరణాన్ని మెషీన్లతో కృత్రిమంగా రూపొందించిన ప్రయోగశాలలోని 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేశారు. రెండు నెలలుగా చేస్తున్న పరిశోధనలో ఈ పంటకు సంబంధించి కుంకుమ పువ్వులు వచ్చాయని ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. దీంతో తెలంగాణలో సైతం నియంత్రిత వాతావరణంలో కశ్మీర్‌లో పండే కుంకుమపువ్వును ఇక్కడ కూడా పండించవచ్చని ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిరూపించారు.
కశ్మీర్‌లో తగ్గినా.....
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ప్యాంఫోర్ గ్రామానికే సంప్రదాయక కుంకుమ పువ్వు సాగు పరిమితమైంది. ప్రపంచంలో అత్యధికంగా ఇరాన్ కుంకుమ పువ్వు సాగు చేసి ఉత్పత్తి చేస్తుండగా, ఆ తర్వాత కశ్మీర్‌లోనే ఈ కుంకుమ పువ్వు ఎక్కువగా సాగవుతోంది. అయితే పర్యావరణ మార్పులతో కుంకుమ పువ్వు సాగు విస్తీర్ణం తగ్గడమే కాకుండా, నాణ్యత కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ సాగు మార్గాల్లో కుంకుమ పువ్వు ఉత్పత్తికి పరిశోధనలు మొదలయ్యాయి.
తెలంగాణ ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు ఏరోపోనిక్ విధానంలో కుంకుమ పువ్వు సాగును ఎన్నుకొన్నారు. కశ్మీర్ తరహాలో రాత్రి, పగలు వేర్వేరు ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, అక్కడి సూర్యరశ్మి, కర్బన వాయువు మోతాదును అందించేలా మెషీన్లతో ప్రయోగశాలను రూపొందించి, అవసరమైనప్పుడు మార్పులకు వీలుగా ఉండేలా పరికరాలు ఏర్పాటు చేసుకొని, కశ్మీర్ నుంచి తీసుకొచ్చిన కుంకుమపువ్వు గడ్డలను ఈ ప్రయోగశాలలో ఉంచి మొలకెత్తించారు.
మొక్కలు పెరగడం, పూత ఇచ్చేందుకు అవసరమైన ఉష్ణోగ్రత, కృత్రిమ లైట్లను ఎప్పటికప్పుడు మారుస్తూ కుంకుమ పువ్వు తీస్తున్నారు. ఈ కుంకుమ పువ్వు సాగుకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ఓ యాప్ ద్వారా ఉష్ణోగ్రతలను నియంత్రించినట్టు శాస్త్రవేత్త పిడిగం సైదయ్య తెలిపారు. ఎక్కువగా కూలీల అవసరం లేకపోవడం, పూర్తిస్థాయిలో సేంద్రీయం కావడం, దిగుబడి నాణ్యత ఆధారంగా భవిష్యత్‌లో కృత్రిమ పద్ధతిలో సాగు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
రైతులను త్వరలో పరిచయం చేస్తాం
రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందించే విధంగా వర్సిటీలో పరిశోధనలు చేపడుతున్నాం. అందులో భాగంగా కశ్మీర్‌లోని చల్లని వాతావరణంలో పండే కుంకుమ పువ్వును విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలో పైలట్ ప్రాతిపదికన చేపట్టాం.
దీనిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ త్వరలోనే పరిచయం చేస్తాం. పూర్తిస్థాయి వివరాలు అందిస్తాం. అవసరమైతే ప్రాంతాల వారీగా సైతం వర్సిటీ పరిధిలోని కళాశాలలు, ఉద్యాన పరిశోధన సంస్థలలో సాఫ్రాన్ మోడల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి స్థానిక రైతులకు శిక్షణ ఇస్తాం. – డాక్టర్ దండా రాజిరెడ్డి, వీసీ, ఉద్యాన విశ్వవిద్యాలయం
రైతుల ఆదాయం మెరుగుపరిచేందుకు..
రైతుల ఆదాయం మెరుగు పరచాలనే ఉద్దేశంతో నూతన పరిజ్ఞానాన్ని అందరికీ అందించే పథకాలకు అండగా నిలుస్తున్నాం. తెలంగాణలో కుంకుమ పువ్వు సాగు సాధ్యాసాధ్యాలపై నిగ్గు తేల్చేందుకుగాను ఉద్యాన వర్సిటీకి నిధులు అందించాం. కుంకుమ పువ్వు ఏరోఫోనిక్ పద్ధతిలో ఇక్కడ వచ్చింది. వీటిపై ఔత్సాహికులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం. గ్రామీణ అభివృద్ధికి, రైతుల ఆదాయాలు పెంపొందించేందుకు ఉపయోగపడే అన్ని టెక్నాలజీలను కూడా ప్రోత్సహిస్తాం. - బి. ఉదయ్‌భాస్కర్, చీఫ్ జనరల్ మేనేజర్, నాబార్డ్, హైదరాబాద్


