చెక్‌డ్యామ్‌లకు నాబార్డ్‌ రుణం! 

Irrigation Department Planning To Take Loans From NABARD  - Sakshi

రూ.1,650 కోట్లు రుణాలు తీసుకునేలా కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌లకు నిధుల కొరత లేకుండా నాబార్డ్‌ నుంచి రుణాలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం నేపథ్యం లో రాష్ట్ర బడ్జెట్‌ నుంచి నిధుల కేటాయింపులు కష్ట సాధ్యం కావడంతో ఈ మేరకు రుణాలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. మొత్తంగా రూ.1,650 కోట్ల మేర రుణాలు తీసుకునేలా నాబార్డ్‌ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1,235 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం కాగా, వీటికి రూ.4,920 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంది. తొలి విడతగా ఈ ఏడాది గోదావరి బేసిన్‌లో 410, కృష్ణాబేసిన్‌లో 200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని తలపెట్టి ఇప్పటికే సాంకేతిక అనుమతులు ఇచ్చే ప్రక్రియ వేగిరం చేశారు. ఇలా 250 చెక్‌డ్యామ్‌లకు అనుమతులివ్వగా, 100 వరకు టెండర్లు పిలిచారు. మిగతా వాటికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. వాటికి నిధుల కొరత లేకుండా ఈ మార్చి నెల వరకు నిర్మించే చెక్‌డ్యామ్‌ల అవసరాలకు రూ.150 కోట్లు, ఆ తర్వాత వార్షిక ఏడాదికి మరో రూ.1500 కోట్లు రుణాలు తీసుకునేలా చర్చలు జరుపుతోంది. దీనిపై మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top