పోలవరానికి రూ.2,234.288 కోట్లు

Above 2234 Crore To Polavaram From Central Govt For Reimbursement - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో కేంద్రం తరఫున రీయింబర్స్‌మెంట్‌ నిమిత్తం రూ.2,234.288 కోట్లను మంజూరు చేస్తూ నాబార్డు డీజీఎం వికాశ్‌ భట్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నిధులను జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ), పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది. వచ్చే నెల మొదటి వారంలో ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ కానున్నాయి. ఈ రూ.2,234.288 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ కోసం కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల్‌ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే వరకు.. అంటే 2016 సెప్టెంబర్‌ 8 వరకు పోలవరానికి కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించి విడుదల చేసేది.

ఆ తర్వాత నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే సమయంలో నాబార్డు నుంచి రుణం తీసుకుని పోలవరానికి నిధులిస్తామంటూ మెలిక పెట్టింది. అప్పటినుంచి అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్‌ చేస్తూ వస్తోంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రాష్ట్ర ప్రభుత్వం రూ.4,730.71 కోట్లను ఖర్చు చేసింది. విభజన చట్టం ప్రకారం 2014 ఏప్రిల్‌ 1 తర్వాత ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికయ్యే వంద శాతం వ్యయాన్ని కేంద్రమే భరించాలి. ఈ నేపథ్యంలో 2014 ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12,529.42 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.8,614.16 కోట్లను నాబార్డు రీయింబర్స్‌ చేస్తూ ఎన్‌డబ్ల్యూడీఏ, పీపీఏలకు విడుదల చేసింది. అందులో పీపీఏ రూ.8,507.26 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. దీంతో మిగతా రూ.4,022.16 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందులో రూ.2,234.288 కోట్లను రీయింబర్స్‌ చేయాలని నాబార్డును కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top