అప్పుల సాగు..రైతుబంధుతో కాస్త బాగు | Nabard latest survey on Rythu bandhu | Sakshi
Sakshi News home page

అప్పుల సాగు..రైతుబంధుతో కాస్త బాగు

Dec 26 2018 3:05 AM | Updated on Dec 26 2018 3:05 AM

Nabard latest survey on Rythu bandhu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అప్పులు అధికంగా తీసుకునే రైతుల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రమే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని నాబార్డు స్పష్టం చేసింది. తెలంగాణలో 79.5 శాతం రైతు కుటుంబాలు అప్పులు చేస్తున్నాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2015 జూలై ఒకటో తేదీ నుంచి 2016 జూన్‌ 30 వరకు జాతీయ గ్రామీణ ఆర్థిక సర్వే (ఆలిండియా రూరల్‌ ఫైనాన్సియల్‌ ఇంక్లూజన్‌) పేరిట నాబార్డు సర్వే నిర్వహించింది. వ్యవసాయ, వ్యవసాయేతర కుటుంబ ఆదాయాలు, వ్యవసాయ రంగంలో రైతులు అవలంబిస్తున్న విధానాలపై సర్వే చేసింది. 29 రాష్ట్రాలలోని 245 జిల్లాల్లో 2,016 గ్రామాల్లో 40,327 కుటుంబాలను సర్వే చేసింది. మన రాష్ట్రంలో ఉమ్మడి ఆరు జిల్లాల్లోని 48 గ్రామాల్లో 958 కుటుంబాలను సర్వే చేసింది. వాటి వివరాలను తాజాగా బయటపెట్టింది. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిందని, రైతుబంధుతో గ్రామాల్లో ప్రైవేటు అప్పులు తగ్గాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఎకరాకు రూ.4 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో సాగు, విత్తన ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తగ్గిందంటున్నారు.

కూలీ ద్వారానే అధిక ఆదాయం
దేశవ్యాప్తంగా వ్యవసాయ కుటుంబాలు సాగు ద్వారాకంటే కూలీ పనులకు వెళ్లి అధికంగా ఆదాయాన్ని పొందుతు న్నారు. ఉదాహ రణకు వ్యవసాయ కుటుంబంలో సాగు ద్వారా నెలకు రూ. 3,140 ఆదాయం వస్తే, వేతన కూలీకి పొలం పనుల ద్వారా రూ.3,025, ఉపాధి కూలీ ద్వారా రూ.1,444 వస్తోంది. అంటే మొత్తం రూ.4,469గా ఉంది. అలాగే చాలామంది వ్యవ సాయ కుటుం బాలకు వ్యవసాయ యంత్రాలు అందుబాటులో లేవు. కేవలం 5% మంది రైతులు మాత్రమే దేశవ్యాప్తంగా ట్రాక్టర్లు కలిగి ఉన్నారు. ఇందులో పంజాబ్‌లో అధికంగా 31%, గుజ రాత్‌లో 14%, మధ్యప్రదేశ్‌లో 13% ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక పవర్‌ టిల్లర్స్‌ 1.8%, స్ప్రింక్లర్లు 0.8%, సూక్ష్మసేద్యం 1.6%, హార్వెస్టర్లు 0.2% ఉన్నట్లు సర్వే నివేదిక స్పష్టం చేసింది. ఇక మన రాష్ట్రంలో 2017 నుంచి రాష్ట్ర ప్రభు త్వం పెద్దఎత్తున సబ్సిడీ ట్రాక్టర్లను పంపిణీ చేసిందని, దీంతో ఇప్పుడు ట్రాక్టర్లు కలిగిఉన్న వారి శాతం పెరి గిందని ఒక వ్యవసాయాధికారి వ్యాఖ్యా నించారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులకు వినియోగిస్తున్న యంత్రాలలో పవర్‌ టిల్లర్స్‌ (చిన్న సాగు యంత్రాలు)7 శాతం ఉన్నట్లు నాబార్డు సర్వే వెల్లడించింది. 

చదువుకోని వ్యవసాయ కుటుంబాలు 32 శాతం..
సర్వే ప్రకారం వ్యవసాయ కుటుంబాల్లో అసలు చదువుకోని (నిర క్షరాస్యులు) వారి శాతం దేశవ్యాప్తంగా 32.2% ఉంది. అలాగే కాస్తో కూస్తో చదవగలిగిన ప్పటికీ సాధారణ విద్య కూడా అభ్యసించని వారు 8% ఉన్నారు. వ్యవసాయేతర కుటుంబాల్లో సాధారణ విద్య అభ్యసించని వారు 7%గా ఉన్నారు. సగటున వ్యవసాయ కుటుంబాల్లో నెలవారీ ఆదాయం రూ.8,931గా ఉంది. అలాగే రాష్ట్రంలో నెలవారీ ఆదాయం రూ.7,811గా ఉంటే ఖర్చు రూ.6,813గా ఉంది. మిగులుతోంది కేవలం రూ.998 మాత్రమే కావడం గమనార్హం. 

పాడిపశువుల పోషణే ఆర్థిక భరోసా..
పాడి పశు పోషణ ద్వారానే రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని నాబార్డు సర్వే స్పష్టం చేసింది. కరువుకాటకాలు వచ్చినప్పుడు, విపత్తులు సంభవించినపుడు పశుసంపదనే కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పశుసంపద కలిగిన దేశాల్లో మన దేశమే మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో వ్యవసాయ కుటుంబాలు 50.7 శాతం పాడి పశువుల పోషణ చేస్తుండగా, దుక్కిటెద్దులు కలిగి ఉన్నవారు 10.8 శాతంగా ఉంది. కోళ్లు వంటివి 5 శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. వ్యవసాయేతర కుటుంబాల్లో కేవలం 5.7 శాతం మంది మాత్రమే పాడి పోషణ కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు లేని వారికి, చిన్న, మధ్య తరహా, మహిళా రైతులకు కూడా పాడి ద్వారా ఉపాధి కలుగుతోంది. దీని ప్రకారం వ్యవసాయానికి అనుబంధంగా పాడి పోషణ ఉంటే నష్టాలు వచ్చినపుడు రైతులు నిలదొక్కుకోవచ్చునని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో పాడి రైతులకు ప్రభుత్వం బర్రెలు లేదా ఆవులు ఇవ్వడం వల్ల ఎంతోకొంత వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఏర్పడ్డాయని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement