సాక్షి, అమరావతి: సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్) రైతన్నలకు ఎంతో లాభదాయకమని నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ నాబ్కాన్స్ అధ్యయన నివేదిక వెల్లడించింది. అవసరమైన చోట్ల మాత్రమే మొక్కలకు నీరు అందడం వల్ల కలుపు, చీడపీడల సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చు.
సూక్ష్మ సేద్యం ద్వారా కేవలం నీరు మాత్రమే కాకుండా విద్యుత్తు, కూలీల వ్యయంలో పెద్ద ఎత్తున ఆదా అవుతుంది. తద్వారా అన్నదాతలకు సాగు వ్యయం, అనవసర ఖర్చులు తగ్గిపోయి అదనపు ఆదాయం సమకూరుతుందని నాబ్కాన్స్ అధ్యయనంతో తేలిందని సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది.
సూక్ష్మ సేద్యం విధానంలో హెక్టార్‌కు గంటకు 1,553 కిలోవాట్ల విద్యుత్ ఆదా అవుతుంది. యూనిట్ విద్యుత్‌కు రూ.4 చొప్పున ఆదా అవుతుందని నాబ్కాన్స్ నివేదిక తెలిపింది. హెక్టార్‌కు 52 పనిదినాల కూలీల వ్యయం తగ్గుతుంది. రోజు కూలీ రూ.245 చొప్పున ఆదా అవుతుంది. హెక్టార్‌కు సాగు వ్యయం రూ.21,500 తగ్గుతుండగా అదనపు ఆదాయం రూ.1,15,000 సమకూరుతుంది.
సబ్సిడీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు
రైతులకు బహుళ ప్రయోజనాలను అందించే కేంద్ర ప్రాయోజిత పథకమైన ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎం కేఎస్‌వై) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తోందని సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాలతో పాటు మెట్ట ప్రాంతాల్లో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తూ సబ్సిడీపై బిందు, తుంపర్ల సేద్యం పరికరాలను సమకూరుస్తున్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో 11.91 లక్షల మంది రైతులు 13.41 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అనుసరిస్తున్నారు. ఈ ఆర్థిక ఏడాది 75,000 హెక్టార్లను సూక్ష్మ సేద్యం కిందకు తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 60,500 హెక్టార్లకుపైగా ఈ పరిధిలోకి తెచ్చినట్లు వెల్లడించింది. మరో 2,38,070 హెక్టార్లను సూక్ష్మ సేద్యం కిందకు తెచ్చేందుకు రైతు భరోసా కేంద్రాల్లో 2.02 లక్షల రైతులు నమోదు చేసుకున్నట్లు సర్వే పేర్కొంది.
ఐదు రాష్ట్రాల్లో 70 శాతం
సూక్ష్మ సేద్యం చేయడం ద్వారా ఎంత మేరకు నీరు, విద్యుత్, కూలీల వ్యయం తగ్గుతుంది? సాగు ఖర్చులు ఎంత తగ్గుతాయి? రైతులకు అదనపు ఆదాయం ఎంత లభిస్తుందనే అంశాలపై నాబ్కాన్స్ గణాంకాలు రూపొందించినట్లు సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది.
నీటి కొరతను అధిగమించేందుకు సూక్ష్మ సేద్యాన్ని అన్ని రాష్ట్రాల్లో ప్రోత్సహించాలని నాబ్కాన్స్ నివేదిక సూచించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సూక్ష్మ సేద్యం విస్తీర్ణంలో 70 శాతం ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల్లోనే ఉందని వెల్లడించింది. మిగతా రాష్ట్రాల్లోనూ సూక్ష్మ సేద్యాన్ని విస్తరించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment