రుణ పరపతి రూ.83,400 కోట్లు! | Nabard pegs Telangana credit potential at ₹83400 crore | Sakshi
Sakshi News home page

రుణ పరపతి రూ.83,400 కోట్లు!

Apr 18 2018 2:49 AM | Updated on Apr 18 2018 2:49 AM

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రుణ పరపతి అంచనా రూ.83,400 కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఉంటుందని నాబార్డు వెల్లడిం చింది. అందులో వ్యవసాయ, అనుబంధ దీర్ఘకాలిక రుణాలు రూ.16 వేల కోట్లు ఉంటాయని తెలిపింది. మంగళవారం ఈ మేరకు నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ రాధాకృష్ణన్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ అంచనా ప్రకారమే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) రుణ ప్రణాళికను ఖరారు చేస్తుందని తెలిపారు.

2018–19లో రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు తరఫున రూ.12,200 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 అభివృద్ధి పథకాలకు రూ.5,600 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన మిషన్‌ భగీరథకు రూ.6,791 కోట్లు మంజూరు చేశామని, అందులో ఇప్పటివరకు రూ.3,884 కోట్లు విడుదల చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో పాడి అభివృద్ధి, కూరగాయల సాగు, వ్యవసాయ యాంత్రీకరణ, సమగ్ర వ్యవసాయ వ్యవస్థలకు తోడ్పాటు అందిస్తామని వివరించారు.

2022–23 నాటికి రైతు ఆదాయం రెట్టింపునకు తమ వంతు సాయం చేస్తామన్నారు. 2018–2023 మధ్య రాష్ట్రంలో వివిధ రకాల చెందిన 4.02 లక్షల యూనిట్లు స్థాపించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. అందుకు రూ.5,639 కోట్ల బ్యాంకు రుణాలు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరో 225 రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

గతేడాది రుణ ప్రణాళికలో 78 శాతం వృద్ధి కనిపించిందని తెలిపారు. రైతుబంధు పథకం కింద రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం చేసినా వారు బ్యాంకు రుణాలు తీసుకుంటారని రాధాకృష్ణన్‌ అన్నారు. కౌలు రైతులకు కూడా వ్యక్తిగత రుణాలు ఇస్తామని, ఈ మేరకు తాము బ్యాంకులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement