ములుగు: మేడారంలో విషాదం చోటు చేసుకుంది. జంపన్నవాగులో పడి భక్తుడు మృతి చెందాడు. మృతుడు మంచిర్యాలకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అంతకు ముందు భూపాలపల్లి జిల్లాలో మేడారం జాతరకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడిన భక్తుల్ని ఆస్పత్రికి తరలించారు.
భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం బోర్లగూడెం గ్రామం సమీపంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లేందుకు ఒక ట్రాక్టర్‌లో 25 మందికి పైగా భక్తులు ప్రయాణిస్తున్నారు. ట్రాక్టర్ నియంత్రణ కోల్పోయి బోల్తా పడటంతో తల్లి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.
మెదారం జాతరకు ప్రతి రెండేళ్లకోసారి లక్షలాది మంది భక్తులు తరలివెళ్తారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, వ్యక్తిగత వాహనాల్లో బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ట్రాక్టర్‌లో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాల్లో అధిక సంఖ్యలో ప్రయాణించరాదని అధికారులు సూచించారు.


