
నేడు డ్యురాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్
నార్త్‌ఈస్ట్ ఎఫ్‌సీతో డైమండ్ హార్బర్ ‘ఢీ’
సాయంత్రం గం. 5:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
కోల్‌కతా: ఆసియా ఖండంలో అత్యంత పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌గా గుర్తింపు సాధించిన... దేశవాళీ వార్షిక పుట్‌బాల్ టోర్నీ డ్యురాండ్ కప్ ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ టోర్నీ 134వ ఎడిషన్ ఫైనల్లో శనివారం డైమండ్ హార్బర్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)తో నార్త్ ఈస్ట్ ఫుట్‌బాల్ క్లబ్ అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ సీజన్‌తోనే అరంగేట్రం చేసిన డైమండ్ హార్బర్ జట్టు... తొలిసారే టైటిల్ హస్తగతం చేసుకోవాలని తహలాడుతుండగా... డిఫెండింగ్ చాంపియన్ నార్త్‌ఈస్ట్ ఫుట్‌బాల్ క్లబ్ టైటిల్ నిలబెట్టుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. తద్వారా 34 ఏళ్లలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలవాలని చూస్తోంది.
ఈ టోర్నీలో చివరగా 1989, 90, 91లో ఈస్ట్ బెంగాల్ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆ తర్వాత మరే జట్టు వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలవలేకపోయింది. నార్త్ ఈస్ట్ హెడ్ కోచ్ జాన్ పెడ్రో బెనాలీ మాట్లాడుతూ... ‘తుదిపోరులో ఫేవరెట్స్ ఉండరు. మెరుగైన ప్రదర్శన చేసిన జట్లే ఫైనల్‌కు చేరుతాయి. మానసికంగా పైచేయి సాధించగల జట్టే ట్రోఫీ చేజిక్కించుకుంటుంది’ అని అన్నాడు. మరోవైపు కిబు వికునా శిక్షణలో రాటుదేలిన డైమండ్ హార్బర్ జట్టు... ఈ టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది.
శనివారం పోరులో డైమండ్ హార్బర్ జట్టు విజయం సాధిస్తే... ఓపెన్ ఎరాలో అరంగేట్రంలోనే టైటిల్ గెలిచిన తొలి జట్టుగా నిలవనుంది. తొలి సెమీఫైనల్లో నార్త్ ఈస్ట్ 1–0 గోల్స్ తేడాతో షిల్లాంగ్ లాజాంగ్ జట్టుపై విజయం సాధించగా... రెండో సెమీస్‌లో డైమండ్ హార్బర్ 2–1తో ఈస్ట్ బెంగాల్‌పై గెలిచి ఫైనల్లో అడుగు పెట్టింది.
విజేతకు రూ. 1.21 కోట్లు
డ్యురాండ్ కప్ 134వ ఎడిషన్ విజేతకు భారీ ప్రైజ్‌మనీ దక్కనుంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ప్రైజ్‌మనీని 250 శాతం పెంచినట్లు డ్యురాండ్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ (డీసీఓసీ) వెల్లడించింది. ఫైనల్లో నెగ్గిన జట్టుకు రూ. 1.21 కోట్లు లభిస్తుందని డీసీఓసీ శుక్రవారం పేర్కొంది. రన్నరప్ జట్టుకు రూ. 60 లక్షలు దక్కనున్నాయి. సెమీఫైనల్స్‌లో ఓడిన జట్లకు రూ. 25 లక్షల చొప్పున... క్వార్టర్ ఫైనల్లో ఓడిన జట్లకు రూ. 15 లక్షల చొప్పున ఇస్తారు. ‘గోల్డెన్ బాల్’, ‘గోల్డెన్ బూట్’, ‘గోల్డెన్ గ్లవ్’ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లకు రూ. 3 లక్షల నగదు బహుమతితో పాటు ఒక మహింద్ర ఎక్స్‌యూవీ కారు లభించనుంది.