
PC: NEUtdFC
నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశవాళీ వార్షిక పుట్‌బాల్ టోర్నమెంట్ డ్యురాండ్ కప్ టైటిల్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. తద్వారా ఈస్ట్ బెంగాల్ జట్టు (మూడుసార్లు) తర్వాత అత్యధికసార్లు ఈ ట్రోఫీ గెలిచిన రెండో జట్టుగా నిలిచింది.
డ్యూరాండ్ కప్-2025 (Durand Cup) ఎడిషన్‌లో అరంగేట్ర జట్టు డైమండ్ హార్బర్ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఓడించి నార్త్ ఈస్ట్ ఫుట్‌బాల్ క్లబ్ ఈ ఘనత సాధించింది. కాగా ఆసియా ఖండంలో అత్యంత పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌గా డ్యూరాండ్ కప్ టోర్నీకి పేరుంది.
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి..
ఈ మెగా ఈవెంట్‌లో ఈ ఏడాది అడుగుపెట్టిన డైమండ్ హార్బర్ జట్టు తొలి ప్రయత్నంలోనే.. సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ నార్త్ ఈస్ట్ ఫుట్‌బాల్ క్లబ్‌తో శనివారం నాటి టైటిల్ పోరులో తలపడింది.
ఆరు గోల్స్.. వేర్వేరు ఆటగాళ్లు
ఈ క్రమంలో కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో నార్త్ ఈస్ట్ ఫుట్‌బాల్ క్లబ్ ఆది నుంచే అదరగొట్టింది. అషీర్ అక్తర్ మ్యాచ్ ముప్పైవ నిమిషంలో గోల్ కొట్టి జట్టుకు శుభారంభం అందించగా.. పార్థిబ్ గొగొయ్ రెండో గోల్ కొట్టాడు.
సెకండాఫ్ యాభైవ నిమిషంలో థోయీ సింగ్ మూడో గోల్ కొట్టగా.. 81వ నిమిషంలో జైరో సంపేరియో, 86వ నిమిషంలో ఆండీ రోడ్రిగెజ్ గోల్స్ కొట్టారు. ఇక అలాడిన్ అజారీ ఆరో గోల్ కొట్టగా.. నార్త్ ఈస్ట్ ఫుట్‌బాల్ క్లబ్ విజయం ఖరారైంది. 6-1 తేడాతో డైమండ్ హార్బర్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి డ్యూరాండ్ కప్‌ను కైవసం చేసుకుంది. కాగా డైమండ్ హార్బర్ జట్టు తరఫున జాబీ జస్టిన్ సాయంతో మైకేల్ కొర్టాజర్ ఓ గోల్ కొట్టాడు.
విజేతకు రూ. 1.21 కోట్లు
ఇక డ్యూరాండ్ కప్-2025 విజేత నార్త్‌ఈస్ట్ ఫుట్‌బాల్ క్లబ్‌కు రూ. 1.21 కోట్ల భారీ ప్రైజ్‌మనీ దక్కింది. గతేడాది ప్రైజ్‌మనీ కంటే ఇది 250 శాతం ఎక్కువ. ఇక రన్నరప్ డైమండ్ హార్బర్ క్లబ్‌కు రూ. 60 లక్షలు దక్కుతాయి. ఇదిలా ఉంటే.. డ్యూరాండ్ కప్- 1989, 90, 91లో ఈస్ట్ బెంగాల్ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆ తర్వాత 34 ఏళ్లకు అంటే మళ్లీ ఇప్పుడే నార్త్ ఈస్ట్ ఇలా వరుసగా రెండోసారి టైటిల్ గెలిచింది.