PC: PTI
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా (IND vs SA 1st Test) చేదు ఫలితాన్ని చవిచూసింది. సొంతగడ్డపై చతికిల పడి సఫారీల చేతిలో ఓటమిపాలైంది. కోల్‌కతాలో ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో గిల్ సేన ముప్పై పరుగుల తేడాతో పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ (Eden Gardens Pitch)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
మ్యాచ్ మూడురోజుల్లోనే ముగిసిపోవడం.. నాలుగు ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క అర్ధ శతకం నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఘాటుగానే స్పందించాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ కోరిన విధంగానే తమ క్యూరేటర్ పిచ్ తయారుచేశాడని కౌంటర్ ఇచ్చాడు.
సంతృప్తిగానే గంభీర్
ఈ క్రమంలో తొలి టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) స్పందిస్తూ.. ‘‘ఈ పిచ్‌పై పరుగులు రాబట్టవచ్చు. అయితే, మా వాళ్లు డిఫెన్స్ సరిగ్గా ఆడలేకపోయారు’’ అని పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తప్పేమీ లేదన్నట్లు అతడిని సమర్థించాడు. ఇక భారత్- సౌతాఫ్రికా మధ్య శనివారం (నవంబరు 22) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు గువాహటిలోని బర్సపరా స్టేడియం వేదిక.

ఆలింగనం చేసుకున్న గౌతీ
అయితే, టీమిండియా మాత్రం ఇంకా కోల్‌కతాలోనే ఉంది. అక్కడే ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ పట్ల గంభీర్ వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది. సుజన్‌ను ఆలింగనం చేసుకున్న గంభీర్.. అతడితో నవ్వుతూ ముచ్చటించాడు. తద్వారా తమ మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు.
చెప్పిందే చేశానన్న పిచ్ క్యూరేటర్
ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై విమర్శల నేపథ్యంలో సుజన్ ముఖర్జీ టైమ్స్ నౌ బంగ్లాతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరు పిచ్ గురించే ప్రశ్నిస్తున్నారు. టెస్టు మ్యాచ్ కోసం ఎలాంటి పిచ్ తయారుచేయాలో నాకు బాగా తెలుసు. అదే విధంగా తొలిటెస్టుకూ పిచ్‌ను రూపొందించాను.
జట్టు కోరినట్లుగానే పిచ్ తయారు చేశా. వేరే వాళ్లు ఏదో చెప్పారని నేను చేయను. అది సరైంది అనిపిస్తేనే చేస్తా. ఏదేమైనా నా పనిని పూర్తి అంకితభావంతో పూర్త చేస్తా. భవిష్యత్తులోనూ నా వైఖరి ఇలాగే ఉంటుంది’’ అని స్పష్టం చేశాడు.
చదవండి: నేనేమీ హర్మన్‌ప్రీత్ కౌర్‌ని కాదు.. అలా ఎందుకు చేస్తా?: బంగ్లా కెప్టెన్ ఓవరాక్షన్


