60 చార్టెర్డ్ విమానాల్లో తరలిరానున్న ప్రముఖులు
అయోధ్య: అయోధ్య రామాలయంలో ఈ నెల 25వ తేదీన చేపట్టే ధ్వజా రోహణ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సుమారు 60 చార్టెర్డ్ విమానాల్లో తరలిరానున్నారు. వీరికోసం అయోధ్య విమానాశ్రయంలో అదనంగా 100 మంది సీఐఎస్‌ఎఫ్ జవాన్లను నియమిస్తామని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ధీరేంద్ర సింగ్ వెల్లడించారు. సుమారు 60 చార్టర్డ్ విమానాలు వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం.
ఈ విమానాల కోసం సమీప ఎయిర్‌పోర్టుల్లో పార్కింగ్ వసతులను కల్పించామన్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీ కోసం స్పెషల్ లాంజ్ ఉంటుందని, సీఎం, గవర్నర్ తదితరుల కోసం మరో ఆరు వీఐపీ లాంజ్‌లను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రముఖులందరినీ ఈ నెల 24వ తేదీనే రావాల్సిందిగా ఆహ్వానాలు పంపామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. 25వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి 9 గంటల వరకే వీరిని లోపలికి అనుమతిస్తామన్నారు. వీరి కోసం అయోధ్యలోని హోటళ్లలో 1,600 గదులను బుక్ చేశారు.


