తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ కల్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. దీంతో అతడు మినహా మిగతా అందర్నీ ఈ వారం నామినేషన్‌లో వేశాడు బిగ్‌బాస్. వీరిలో ఎవరు ఎక్కువ గేమ్స్ గెలిచి లీడర్ బోర్డ్‌లో టాప్‌లో ఉంటారో వారికి ఇమ్యూనిటీ గెలిచే ఛాన్స్ ఉంది. నిజంగా ఇమ్యూనిటీ గెలిచిన కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ వీక్‌లో అడుగుపెట్టినట్లే లెక్క! మరి ఆ గేమ్స్ ఎలా జరిగాయో సోమవారం (డిసెంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
మనీ బాక్స్
సడన్‌గా బిగ్‌బాస్‌కు ఏమనిపించిందో ఏమో కానీ, ఇంతవరకు కెప్టెన్ అవలేదు కదా.. అంటూ భరణిని కెప్టెన్ చేశాడు. కాకపోతే ఇమ్యూనిటీ లభించదని నొక్కిచెప్పాడు. తర్వాత గార్డెన్ ఏరియాలో బాక్సులు పెట్టారు. అందులో జీరో నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు అంకెలు రాసిపెట్టారు. ఇప్పటివరకు కంటెస్టెంట్ల జర్నీని బట్టి వారికి బాక్సులు ఇవ్వాల్సి ఉందన్నాడు. ఈ పాయింట్స్ విజేత ప్రైజ్‌మనీపై ఎఫెక్ట్ చూపిస్తాయన్నాడు.
సంజనాకు అన్యాయం?
అలా డిమాన్.. సుమన్‌కు లక్ష ఇద్దామనుకోగా అందుకు అందరూ ఓకే చెప్పారు. తర్వాత భరణి.. తనూజకు రూ.2 లక్షలు ఇచ్చాడు. అనంతరం కల్యాణ్ ఇమ్మూకి రూ.2.5 లక్షలు రాసి ఉన్న బాక్స్ ఇచ్చాడు. ఇమ్మాన్యుయేల్.. సంజనాకు రూ.1.50 లక్షల బాక్స్ ఇస్తే ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. అనంతరం సుమన్.. డిమాన్‌కు రూ.1.50 లక్షలిచ్చాడు. చివరగా భరణి, సంజన మిగిలారు.

జైలుకు సంజనా
సంజనాకు రూ.50 వేలు రావాలని ఇమ్మూ, పవన్ సపోర్ట్ చేస్తే మిగిలినవారు భరణికి సపోర్ట్ చేశారు. మెజారిటీ అతడివైపే ఉండటంతో భరణికి రూ.50 వేలు దక్కగా.. సంజనాకు జీరో లభించింది. దీంతో బిగ్‌బాస్ ఆమెను జైల్లో వేశాడు. తనకు జీరో రావడాన్ని సంజనా తట్టుకోలేకపోయింది. తల్లిలా ఆలోచించి ఎమోషనల్ ఫూల్ అవుతున్నా.. ప్రతివారం నన్నే టార్గెట్ చేస్తున్నారు అంటూ ఏడ్చేసింది.
గెలిచేసిన ఇమ్మూ
తర్వాత ఈవారం ఇమ్యూనిటీ కోసం కొన్ని ఛాలెంజ్‌లు ఇవ్వబోతున్నట్లు తెలిపాడు బిగ్‌బాస్. లీడర్ బోర్డులో టాప్‌లో ఉండేవారు నామినేషన్స్ నుంచి సేవ్ అవడంతోపాటు ప్రేక్షకులను ఓటు వేయమని అభ్యర్థించే అవకాశం సంపాదిస్తారు. మొదటి గేమ్‌లో సంజనా పాల్గొనేందుకు వీల్లేదన్నాడు. అలా బిగ్‌బాస్ ఇచ్చిన ఫస్ట్ టాస్క్ 'స్వింగ్ జరా'లో ఇమ్మూ గెలవగా.. భరణి, పవన్, తనూజ, సుమన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మరి తర్వాతి టాస్కుల్లో ఎవరు గెలిచారు? ఎవరు టాప్‌లో ఉన్నారో చూడాలి!


