రోషన్, అనస్వర రాజన్ జోడీగా నటించిన చిత్రం ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నందమూరి కల్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘సల్లంగుండాలే...’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని రితేష్ జి. రావు, మనీషా ఈరబత్తిని ఆలపించగా, బృందా గోపాల్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘భావోద్వేగం, వేడుక రెండింటినీ కలిగి ఉన్న అద్భుతమైన పాట ‘సల్లంగుండాలే...’. వివాహంలో జరిగే ప్రతి ఆచారం, భావోద్వేగాన్ని ఈ పాట అందంగా చూపిస్తుంది. కల్యాణ్ చక్రవర్తి, అర్చన వధువు తల్లిదండ్రులుగా ఆకట్టుకోగా, రోషన్, అనస్వర జోడీ తమ డ్యాన్స్‌తో ఈ పాటకు మరింత ఉత్సాహాన్ని తెచ్చారు. ‘సల్లంగుండాలే...’ పాట ప్రతి వివాహ వేడుకలో మార్మోగబోతోంది’’ అని యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్. మది.


