కోలీవుడ్ స్టార్ దళపతి హీరోగా నటించిన చిత్రం జన నాయగన్. రాజకీయల్లో ఎంట్రీకి ముందే ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దీంతో ఈ మూవీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమా వ్యవహారం కోర్టుకు చేరడంతో రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది.
ఈ మూవీని సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ రివ్యూ చేయాల్సి ఉంది. ఈనెల 9న జరగాల్సిన రివైజింగ్ కమిటీ ప్రదర్శన వాయిదా పడింది. బోర్డ్ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాను మార్చి 17న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం తప్పకుండా స్క్రీనింగ్ జరుగుతుందని సీబీఎఫ్‌సీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడం జరగనుంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్‌కు స్క్రీనింగ్‌కు సంబంధించి అధికారిక మెయిల్ అందినట్లు తెలుస్తోంది.
జన నాయగన్‌ను జనవరి 9న గ్రాండ్‌గా విడుదల చేయాలని మొదట నిర్ణయించారు. కానీ ఈ చిత్రం ఒక వర్గం ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్‌ను నిలిపివేసింది. దీంతో సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని చూసిన ఒక సభ్యుడు సైన్యానికి సంబంధించిన సీన్స్ ఉన్నాయని ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలు చేశాడు. ఆ తర్వాత, జన నాయగన్ నిర్మాతలు జనవరి 6న కోర్టును ఆశ్రయించారు. సెన్సార్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
ఈ చర్యలతో జన నాయగన్ మేకర్స్, సెన్సార్ బోర్డ్‌కు మధ్య నెల రోజుల పాటు వివాదం కొనసాగింది. అయితే మూవీ టీమ్ తమ కేసును ఉపసంహరించుకోవడంతో ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపడానికి సెన్సార్ బోర్డ్ అంగీకరించింది. అయితే ఈ చిత్రంలో కొన్ని రాజకీయ సందేశాలు ఉన్నందున.. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అనుమతిస్తుందో లేదో చూడాల్సిందే.


