అభిమానిని హత్య చేసిన కేసులో జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్.. ఎప్పటికప్పుడు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. జైల్లోని తోటి ఖైదీలపై చేయి చేసుకున్నాడని రెండు రోజుల క్రితం న్యూస్ వచ్చింది. ఇప్పుడు మరో షాకింగ్ ఫొటో వైరల్ అవుతోంది. దర్శన్ హత్య చేసిన రేణుకాస్వామి సమాధి చిత్రదుర్గలో ఉంది. ఇప్పుడు దాన్ని ఎవరో ధ్వంసం చేశారు.
రేణుకా స్వామి హత్య కేసులో వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో సమాధిని ధ్వంసం చేయడం అంటే దర్శన్ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశముంది. ఇతడి అభిమానులే ఈ పని చేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు. రేపు(డిసెంబరు 11) దర్శన్ కొత్త సినిమా 'డెవిల్' థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం అభిమానులు ఆ హడావుడిలోనే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో రేణుకా స్వామి సమాధి ధ్వంసం అయిందని ఒకటి రెండు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

హత్య కేసు సంగతేంటి?
హీరో దర్శన్ దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మి అనే మహిళని పెళ్లి చేసుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పవిత్ర గౌడతో కలిసి ఉంటున్నారని, దీని వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందనే బాధతో రేణుకాస్వామి అనే యువకుడు.. తన ఇన్‌స్టాలో పవిత్రని టార్గెట్ చేశాడు. అశ్లీల సందేశాలు, దర్శన్‌ని విడిచిపెట్టాలని వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయాన్ని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
ఇదే రేణుకాస్వామి హత్యకు దారితీసిందని పోలీసులు గుర్తించారు. ఈ కేసు కన్నడనాట తీవ్ర సంచలనం సృష్టించింది. అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని, కరెంట్ షాక్ కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో హైకోర్టు దర్శన్‌కు గతేడాది అక్టోబర్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో సవాలు చేసింది.
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును పక్కనపెడుతూ అత్యున్నత న్యాయస్థానం ఆ బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో ఈ ఏడాది ఆగస్టులో మళ్లీ దర్శన్‌ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెంగళూరు జైలులో దర్శన్ ఉన్నాడు.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'ను తాకిన కులం, ప్రాంతపు రంగు)


