49 ఏళ్ల వయసులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తోంది టాలీవుడ్ నటి ప్రగతి. పవర్ లిఫ్టింగ్‌లో మూడేళ్లుగా ప్రతిభ చూపిస్తోన్న ఈ నటి ఇటీవల టర్కీలో జరిగిన ఏసియన్ ఓపెన్ అండ్ మాస్ట్రస్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు మెడల్స్ సాధించింది. డెడ్ లిఫ్ట్ విభాగంలో గోల్డ్ మెడల్, బెంచ్, స్క్వాడ్ విభాగంలో రెండు వెండి పతకాలు సాధించింది. ఓవరాల్‌గా సిల్వర్ పతకం వచ్చిందని పేర్కొంది.
సినిమాల్లో అవకాశాలు రాలే
అయితే క్రీడల వైపు అడుగులు వేయడానికి గల కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. స్పోర్ట్స్‌కు 100% ఎలా ఇచ్చానో, సినిమాల్లో కూడా అంతే మనసు పెట్టి యాక్ట్ చేశాను. కాకపోతే సినిమాల్లో నా టాలెంట్ చూపించుకునే అవకాశం దొరకలేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత గొప్ప అవకాశాలు నాకు రాలేదు. కొన్ని పాత్రలకు నన్ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న బాధ అయితే ఉంది.
డిప్రెషన్‌లోకి వెళ్లకుండా..
అది చాలా బెంగగా ఉండేది. ఒకానొక సమయంలో ఛాన్సులు తగ్గిపోయాయి. వాళ్లిచ్చిన అవకాశాలు నాకు నచ్చలేదు. నేను కోరుకుంది వారివ్వలేదు. ఆ బాధ నెమ్మదిగా డిప్రెషన్‌కు మారుతుందేమోనన్న భయం ఉండేది. అప్పుడు నేను స్పోర్ట్స్‌లో అడుగుపెట్టాను. ఇక్కడ నా సాయశక్తులా కష్టపడి ఎదిగాను. వెయిట్ లిఫ్టింగ్ వల్ల అందం పోతుందని నేను అనుకోలేదు. నేను అందంగానే ఉంటాను.
మానసిక ధైర్యం
పైగా ఈ క్రీడలో అడుగుపెట్టాక మానసికంగా మరింత ధృడంగా తయారయ్యాను. ఏదొచ్చినా నేను చూసుకోగలను అన్న ధ్యైర్యం వచ్చింది. ప్రస్తుతం తమిళ సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తున్నాను. జిమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో సినిమా సెట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అంతే గర్వంగా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలే చేయాలనుకుంటున్నాను అని ప్రగతి చెప్పుకొచ్చింది.


