ఫ్లాపులతో ఫేడవుట్ అవుతున్న స్టార్ డైరెక్టర్స్
చిత్ర పరిశ్రమలో టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇక్కడ జాతకాలు తారుమారు కావడానికి ఒక్క శుక్రవారం చాలు. సక్సెస్ ఉంటేనే అవకాశాలు వస్తాయి. అదే ఫ్లాపులొస్తే.. గతంలో బ్లాక్ బస్టర్స్ అందించినా.. కొత్త ప్రాజెక్టు అయితే చేతికి రాదు. ముఖ్యంగా దర్శకుల విషయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఫ్లాపులున్న దర్శకుడితో సినిమా చేసేందుకు అటు నిర్మాతలు..ఇటు హీరోలు వెనకడుగు వేస్తుంటారు. ఒక్కప్పుడు వాళ్లు వరుస హిట్లు అందించినా.. ఫ్లాపులొస్తే అది ‘గత చరిత్ర’గానే మిగిలిపోతుంది. అలా ఒకప్పుడు చరిత్ర సృష్టించి..ఇప్పుడు హిట్ కోసం ఎదురు చూస్తున్న దర్శకులపై ఓ లుక్కేద్దాం.
కొరటాల శివ:
2013లో 'మిర్చి'తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన శివ, మహేష్ బాబు ‘శ్రీమంతుడు' (2015), ఎన్టీఆర్ 'జనతా గారేజ్' (2016), 'భరత్ అనే నేను' (2018)లతో వరుస హిట్లు అందించి స్టార్ డైరెక్ట్‌గా మారిపోయాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్‌తో తీసిన ‘ఆచార్య(2022)’ డిజాస్టర్ అయింది. దీంతో కొరటాలపై నెగెటివ్ టాక్ మొదలైంది. ఎన్టీఆర్‌తో తీయాల్సిన దేవర కూడా పట్టాలెక్కదనుకున్నారు. కానీ ఆచార్య రిలీజ్‌కి ముందే దేవర చిత్రం ఫిక్స్ అయిపోయింది. శివపై నమ్మకంతో ఎన్టీఆర్ చాన్స్ ఇచ్చాడు. ఆ చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్‌గా నిలిచినా..క్రెడిట్ మాత్రం ఎన్టీఆర్‌కే వెళ్లింది.ఇక దేవర 2 ఉంటుందని ప్రకటించి..ఏడాదిన్నర అవుతుంది. కొరటాల చేతిలో అదొక్క ప్రాజెక్టే ఉంది. కానీ అది కూడా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుంది.
కృష్ణ వంశీ
ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ కృష్ణ వంశీ. ఒకప్పుడు ఆయన సినిమా అంటే మినిమమ్ హిట్ అనే గ్యారెంటీ ఉండేది. కానీ ఇప్పుడు కృష్ణ వంశీ సినిమా అంటే..కనీస ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. ‘నక్షత్రం’(2017) అనే సినిమా తర్వాత ఆరేళ్ల గ్యాప్ తీసుకొని ‘రంగమర్తాండ’అనే సినిమాతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి విమర్శకులు ప్రశంసలు అయితే దక్కాయి కానీ..కలెక్షన్స్ మాత్రం రాలేదు. రంగమార్తండ తర్వాత కృష్ణ వంశీ నుంచి మరో చిత్రం రాలేదు.
వీవీ వినాయక్..
హీరోలకు మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలో వీవీ వినాయక్ స్పెషలిస్ట్. ఆది, దిల్, ఠాకూర్, బన్నీ, లక్ష్మీ, యోగి, కృష్ణ, ఖైదీ నంబర్ 150’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను టాలీవుడ్‌కి అందించాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. టాలీవుడ్‌లో ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ‘ఇంటిలిజెంట్’. సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ 2018 ఫిబ్రవరి 9న విడుదలైంది. ఆ చిత్రం తర్వాత తెలుగులో మరో తెలుగు సినిమా చేయలేదు. ‘ఛత్రపతి’చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్‌లో హిందీలో రీమేక్ చేశాడు. 2023లో విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఆ తర్వాత వినాయక్ నుంచి మరో చిత్రం రాలేదు. వెంకటేశ్‌లో ఓ సినిమా ఉంటుందని టాక్ నడుస్తుంది. కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన రాలేదు.
సురేందర్ రెడ్డి
‘అతనొక్కడే’ (2005) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సురేందర్ రెడ్డి. ఆ తర్వాత కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి’ సినిమాలో స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. కానీ 2023లో వచ్చిన ‘ఏజెంట్’ డిజాస్టర్ కావడంతో.. సురేందర్ రెడ్డికి అవకాశాలు తగ్గిపోయాయి. రవితేజతో ఓ సినిమా ఉంటుందని టాక్ ఉంది. కానీ అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు.
వంశీ పైడీపల్లి
మున్నా’ (2007) మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు వంశీ పైడీపల్లి. కెరీర్ మొత్తంలో ఆయన తీసిన తెలుగు సినిమాలు కేవలం ఐదు(మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి) మాత్రమే. అవన్నీ సూపర్ హిట్ చిత్రాలే. అదే ఊపుతో తమిళ్‌లో విజయ్‌తో ‘వారిసు’(తెలుగులో వారసుడు) తెరకెక్కించాడు. 2023లో విడుదలైన ఈ చిత్రం తమిళ్‌లో సూపర్ హిట్ అయినా..తెలుగులో మాత్రం పెద్దగా ఆడలేదు. ఈ చిత్రం తర్వాత కూడా వంశీ నుంచి మరో సినిమా రాలేదు.
శ్రీను వైట్ల
స్టార్ హీరోలతో కూడా కామెడీ చిత్రాలను తీసి నవ్వించిన స్టార్ డైరెక్ట శ్రీనువైట్ల. ఒకప్పడు ఆయన సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. కానీ గత కొన్నాళ్లుగా ఆయన ఖాతాలో హిట్ లేదు. గోపిచంద్ ‘విశ్వం’తో కమ్ బ్యాక్ అవుతాడని అనుకుంటే.. అది భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన చేతిలో కొత్త ప్రాజెక్టులేవి లేదు. మంచు విష్ణుతో ఢీ సీక్వెల్ తీస్తాడనే పుకార్లు వచ్చాయి. చర్చలు కూడా జరిగాయి. కానీ విశ్వం రిలీజ్ తర్వాత ఢీ సీక్వెల్‌ని పక్కన పెట్టేశారు. వీరితో పాటు శ్రీకాంత్ అడ్డాల, శివ నిర్వాణ, పరశురాం లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా కొత్త కబురు చెప్పట్లేదు. మరి వీరి నుంచి బ్లాక్ బస్టర్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.


