నవ్వడం ఓ భోగం. నవ్వించడం యోగం. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే బోలెడంత మంది కమెడియన్స్. ఇలాంటి మూవీస్ తీసే జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ లాంటి చాలామంది దర్శకులు. కానీ ఇప్పుడు కమెడియన్స్ తగ్గిపోయారు. ఆ తరహా చిత్రాలు తీసే డైరెక్టర్స్ కనిపించట్లేదు. ఇంటిల్లిపాదీ చూసే హాస్య భరిత సినిమాలూ తగ్గిపోయాయి. చెప్పాలంటే టాలీవుడ్‌లో 'నవ్వు' సరిగా వినిపించట్లేదు. ఇంతకీ దీనికి కారణమేంటి?
ఒకప్పుడు కామెడీ సినిమాలకు తెలుగు చిత్ర పరిశ్రమ కేరాఫ్ అడ్రస్. దేశంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గర పదుల సంఖ్యలో కమెడియన్స్ ఉండేవాళ్లు. వీరిని ప్రధానంగా పెట్టి 'ఎవడి గోల వాడిది', 'జంబలకిడి పంబ' లాంటి సినిమాలు తీసేవారు. అలాంటి వాటికి ప్రేక్షకుల నుంచి కూడా విశేషాదరణ ఉండేది. కాల క్రమేణా కమెడియన్స్ చేసే కామెడీ.. హీరోలు చేయడం మొదలుపెట్టారు. పదేళ్ల ముందు ఈ ట్రెండ్ బాగా కనిపించింది. స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరూ తాము కామెడీ పండించడంలో ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించారు.
గత కొన్నాళ్ల నుంచి మాత్రం తెలుగులో కామెడీ సినిమాల శాతం తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల వల్ల చాలావరకు హాస్యం అనేదే సరిగా కనిపించట్లేదు. స్టార్ దర్శకులు.. పాన్ ఇండియా మోజులో పడ్డారంటే ఓ అర్థముంది. ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త దర్శకులు కూడా సింపుల్ బడ్జెట్‌లో కామెడీ, ఎంటర్‌టైనర్ కాన్సెప్టులు అస్సలు ఆలోచించడం లేదు. పదుల కోట్లు ఖర్చయ్యే భారీ యాక్షన్ స్టోరీలని సిద్ధం చేసుకుంటున్నారు. పోనీ బాక్సాఫీస్ దగ్గర హిట్స్ కొడుతున్నారా అంటే లేదు. పది చిత్రాలు తీస్తే అందులో ఒకటో రెండు మాత్రం ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్నాయి. మిగిలినవి సోషల్ మీడియాలో మాత్రం హిట్ అనిపించుకుంటున్నాయి.
చెప్పాలంటే పదిహేను ఇరవైళ్ల క్రితం తెలుగు చిత్రసీమకు గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. అంతకు ముందు కూడా ఇలానే ఉండేది. ఎందుకంటే దర్శకనిర్మాతలు అందరూ ఇంటిల్లిపాదీ చూసే కథల్ని సినిమాలుగా తీసేవాళ్లు. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్.. ప్రతివారం థియేటర్లకు క్యూ కట్టేవారు. హిట్ టాక్‌తో పాటు కలెక్షన్స్ అలానే వచ్చేవి. కానీ గత కొన్నేళ్లు నుంచి మాత్రం టార్గెట్ ఆడియెన్స్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది.
అయితే యూత్ కోసం బోల్డ్ కాన్సెప్ట్ మూవీస్ తీస్తున్నారు. లేదంటే యాక్షన్ సినిమాలు అంటున్నారు. ఇవి కాదంటే పీరియాడిక్ మూవీస్ అని హడావుడి చేస్తున్నారు. తప్పితే తక్కువ బడ్జెట్‌లో మనస్ఫూర్తిగా నవ్వుకునే కామెడీ మూవీస్ చేద్దామని యువ దర్శకులు గానీ సీనియర్ డైరెక్టర్స్ గానీ ఆలోచించట్లేదా అనిపిస్తుంది. ఈ ఏడాదినే తీసుకోండి.. సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఏకంగా రూ.200-300 కోట్ల వసూళ్లు అందుకుంది. దీనిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. తెలుగు ఆడియెన్స్ కామెడీ మూవీస్ కోసం ఎంతలా తహతహలాడుతున్నారో.
'సంక్రాంతికి వస్తున్నాం' రేంజులో కానప్పటికీ.. ఈ ఏడాది 'మ్యాడ్ స్క్వేర్', 'సింగిల్', 'లిటిల్ హార్ట్స్', 'కె ర్యాంప్', 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే చిన్న సినిమాలు ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశాయి. కాకపోతే వీటిలో స్టార్స్ ఎవరూ లేరు. కాబట్టి వీటికి పెద్దగా రీచ్, గుర్తింపు దక్కలేదు. అయితే మిడ్ రేంజు హీరోలు, చిన్న హీరోలతో కామెడీ సినిమాలు తీయడం కంటే స్టార్ హీరోలతో కామెడీ చిత్రాలు తీస్తే వాటికి ఉండే రేంజ్ వేరని చెప్పొచ్చు. సరైన కామెడీ కాన్సెప్ట్, స్టార్ హీరోలతో మూవీస్ చేస్తే ఆడియెన్స్ కచ్చితంగా థియేటర్లకు వచ్చే అవకాశముంటుంది. ఎంతసేపు పైరసీ, మరేదో అని బాధపడతారు తప్పితే ఫ్యామిలీ ఆడియెన్స్ వచ్చే కామెడీ చిత్రాల్ని తీద్దామనే విషయాన్ని మాత్రం సరిగా ఆలోచించట్లేదా అనిపిస్తుంది. అందుకే టాలీవుడ్‌లో మనస్ఫూర్తిగా నవ్వుకోవడం అనేది చాన్నాళ్ల మిస్ అవుతూనే ఉంది.


