
రిషబ్ శెట్టి(Rishab Shetty ) దర్శకత్వం వహించి, నటించిన ‘కాంతార చాప్టర్ 1’(Kantara: Chapter 1)ఇప్పుడు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. విడుదలైన తొలి రోజే(అక్టోబర్ 2) ఈ చిత్రం రూ. 89 కోట్ల మేర వసూళ్లను సాధించింది. వీకెండ్లోగా రూ. 300 కోట్లు ఈజీగా రాబడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంతార మాదిరే ప్రీక్వెల్గా వచ్చిన కాంతార చాప్టర్ 1 కూడా సూపర్ హిట్ కావడం పట్ల రిషబ్ శెట్టి ఆనందం వ్యక్తం చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అసలు ఈ కథ రాయాలనే ఆలోచన ఎలా వచ్చిందో వివరించాడు. తన ఊర్లో జరిగిన ఓ గొడవే ఈ సినిమా కథను రాసేలా చేసిందని ఆయన చెప్పారు.
‘20 ఏళ్ల క్రితం మా గ్రామంలో జరిగిన ఓ సంఘటన ‘కాంతార’ కథకు పునాది వేసింది. వ్యవసాయ భూమి కోసం ఒక రైతు, అటవీ శాఖ అధికారి మధ్య ఘర్షణ జరిగింది. అది నాకు ఇద్దరి మనుషుల మధ్య గొడవలా అనిపించలేదు. ప్రకృతిని కాపాడే వారి మధ్య ఘర్షణలా చూశాను. ఈ అంశంతోనే కథను రాయాలనుకున్నాను.
మన సంస్కృతి మొత్తం వ్యవసాయం చుట్టూ ఎలా తిరుగుతుందో ఆలోచించడం ప్రారంభించాను. ఈ క్రమంలో గ్రామీణ ప్రజల సంప్రదాయాలపై దృష్టి పెట్టి ‘కాంతార’ కథను రాశాను’ అని రిషబ్ చెప్పుకొచ్చాడు. కాంతార, కాంతార చాప్టర్ 1 కథలు కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతల్లో ప్రసిద్ధి చెందిన భూతకోల నేపథ్యంలో సాగుతుందన్న సంగతి తెలిసిందే.