
గత 2022లో విడుదలైన కాంతారా సినిమాతో రిషబ్ శెట్టి సినిమా విజయాలలో నటీనటుల భాగస్వామ్యానికి సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు. భారతీయ సంస్కృతి ఆచారాల ఆధారంగా ఆకర్షణీయమైన కథను ఎలా రూపొందించవచ్చో చెబుతూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమాకు ఆయనే హీరో. రచయిత దర్శకుడు కూడా కావడం గమనార్హం. తాజాగా రిషబ్ తన శ్రమకు తగిన ఫలితంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. మరోవైపు కాంతారా 2022లో జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా కూడా జాతీయ అవార్డును అందుకున్నాడు.
చేసే పనిమీదే మనసును లగ్నం చేసేవారిని అపజయాలు మాత్రమే కాదు భారీ విజయాలు కూడా ఆపలేవు. అందుకే రిషబ్ అంకితభావం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ కాంతారా సీక్వెల్ రూపకల్పనలోనూ కనిపిస్తూనే ఉంది. కాంతారా చిత్రాల సాక్షిగా ఆ పాత్రలో ఇమిడిపోయేందుకు తనను తాను చెక్కుకున్న శిల్పిలా మారాడు.. రిషబ్. కాంతారా సిరీస్ కోసం ఆయన నేర్చుకున్న కొన్ని నైపుణ్యాలను పరిశీలిస్తే కళ కోసం ప్రాణం పెట్టడం అంటే ఏమిటో అర్ధమవుతుంది.

భూత కోలా
దక్షిణ కర్ణాటక, ఉడిపి సమీప ప్రాంతాల్లో తులు మాట్లాడే వారు సంప్రదాయంగా భూత కోలా, భూత ఆరాధన పేర్లతో తమను కాపాడే ఆత్మలను ఆరాధిస్తారు. ఈ సందర్భంగా వస్త్రధారణతో పాటు వారు చేసే నృత్యం, అరుపులు కూడా సంక్లిష్టంగా ఉంటాయి. కాంతారా సినిమాలో రిషబ్ స్వయంగా భూత కోలా ను నేర్చుకుని మరీ ప్రదర్శించాడు. అందుకే ఆ సినిమాలో అత్యంత గుర్తుండిపోయే సన్నివేశాల్లో ఒకటిగా ఆ నృత్యం మారింది.

బుల్ రేస్ (కంబాల)
కర్ణాటక కోస్తా ప్రాంతాల్లో వ్యవసాయ సీజన్ ముగిశాక సంప్రదాయంగా నిర్వహించే కంబాల రేసు కూడా కాంతారాలో హైలెట్. చిత్రీకరణ సమయంలో రిషబ్ ఇరవై నాలుగు గంటలకు పైగా ఎద్దులతో పరుగెత్తుతూనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అతని నటనలోని ఆ సన్నివేశాన్ని ఎప్పటికీ మరచిపోలేని కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది.

కలరిపయట్టు
ప్రపంచంలోని పురాతన యుద్ధ కళలలో ఒకటైన కేరళకు చెందిన కలరిపయట్టును కూడా రిషబ్ అభ్యసించాడు. తెరపై అతని రూపం, పోరాటాలు∙వాస్తవికంగాగా ఉండేలా చూసుకోవడానికి, ఆ పోరాట కళను నేర్చుకోవడానికి ఆయన ఒక సంవత్సరం పాటు కష్టతరమైన శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాడు.

ట్రాన్స్‌ఫార్మేషన్..
జిమ్‌లో వర్కవుట్స్ చేస్తే వ్యాయామం అంటారు కానీ తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంటే వ్యాయామ పరిభాషలో ట్రాన్స్‌ఫార్మేషన్‌గా పేర్కొంటారు. తదుపరి రానున్న కాంతారా చాప్టర్ 1 కోసం తన శరీరాన్ని కఠినమైన కసరత్తులతో చెక్కుకున్నాడు. తొలి భాగానికి పూర్తి విరుద్ధంగా అనూహ్యమైన రీతిలో రిషబ్ కనిపిస్తాడు.

గుర్రపు స్వారీ
తన పాత్రను పండించేందుకు రిషబ్ మరో నైపుణ్యాన్ని జోడించాడు. రానున్న కాంతారా చాప్టర్ 1లోని యాక్షన్ సన్నివేశాలకు వాస్తవికత అద్దేందుకు ఆయన గుర్రపు స్వారీని నేర్చుకున్నాడు.
సాంప్రదాయ ఆచారాలను నేర్చుకోవడం మరియు పురాతన యుద్ధ కళలను నేర్చుకోవడం వంటి రిషబ్ శెట్టి అంకితభావం, కాంతారా ఎందుకు ఒక సంచలనం అయ్యిందో మరియు కాంతారా చాప్టర్ 1 ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలుగా ఎందుకు నిలిచిందో చూపిస్తుంది. రిషబ్ తన అసాధారణ ప్రతిభ మరియు సజనాత్మక విధానంతో కథను రీమేక్ చేస్తూనే ఉన్నాడు.