
ఎన్టీఆర్‌గారు నాకు సోదరుడులాంటివారు. మా కుందాపూర్ మూలాలు ఉన్న అబ్బాయి. ఆయన చేసిన సపోర్ట్‌కి రుణపడి ఉంటాను. ఇక ప్రశాంత్ నీల్‌గారితో ఎన్టీఆర్‌గారు చేస్తున్న సినిమాలో నేను నటిస్తున్నానన్న విషయంపై ప్రస్తుతానికి నేను ‘మ్యూట్’.
‘‘భారతదేశం జానపద కథలకు నిలయం. నాకు జానపద కథలు చేయడం అంటే ఇష్టం. ‘కాంతార’ సినిమా కథను నిజాయితీగా చెప్పాలనుకున్నా. అది ప్రేక్షకులకు నచ్చింది’’ అని దర్శక–నిర్మాత–నటుడు రిషబ్ శెట్టి అన్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతార:చాప్టర్ 1’. ‘కాంతార’ (2022) సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార:చాప్టర్ 1’ రూపొందింది.
విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 2న విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 509 కోట్ల వసూళ్లు సాధించి, సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో రిషబ్ శెట్టి చెప్పిన విశేషాలు.
⇒ ‘కాంతార’ సినిమాకు ఎలాంటి స్పందన లభించిందో, ‘కాంతార: చాప్టర్ 1’కూ అలాంటి గొప్ప రెస్పాన్సే ప్రేక్షకుల నుంచి లభిస్తోంది ‘కాంతార’ చేసేటప్పుడే ‘కాంతార: చాప్టర్ 1’ గురించిన ఆలోచన ఉంది. ‘కాంతార’ చిత్రానికి వచ్చిన అద్భుతమైన స్పందన చూసి, ‘కాంతార: చాప్టర్ 1’ కథ రాయడం మొదలుపెట్టాను.
⇒ చిన్నప్పట్నుంచి మా ఊరి (కుందాపూర్) కథలు చెప్పాలని ఉండేది. ‘కాంతార’ మా ప్రాంతంలో జరిగిన కథ. అందుకే లొకేషన్స్‌ను మా ప్రాంతంలోనే తీసుకోవడం జరిగింది. మేజర్ షూటింగ్‌ని మా ఊర్లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో జరిపాం.
⇒ నాలో దర్శకుడు ఉన్నాడు... యాక్టర్ ఉన్నాడు. ఈ రెండింటిలో ఏది ఫస్ట్ అంటే డైరెక్షనే అని చెబుతాను.
⇒ ముంబైలోని ఓ నిర్మాణ సంస్థలో డ్రైవర్‌గా పని చేశాను. ఇప్పుడు మంచి సక్సెస్‌లో ఉన్నాను. ఆర్టిస్టుగా జాతీయ అవార్డు అందుకున్నాను. నా జర్నీలో భాగమైన అందరికీ ధన్యవాదాలు. అలాగే ‘కాంతార’ జర్నీలో, నా జీవితంలో నా భార్య (ప్రగతి శెట్టి) ఇచ్చిన స పోర్ట్‌ను మర్చి పోలేను. ఒకవైపు ‘కాంతార’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తూనే, మరోవైపు నన్ను, నా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంది. తను డబుల్ రోల్ చేసింది.
⇒ ప్రస్తుతం తెలుగులో ఓ పీరియాడికల్ మూవీ, హిందీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ చిత్రాల అనౌన్స్‌మెంట్ వచ్చాయి. కానీ నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’.