
‘‘ప్రస్తుతం షూటింగ్ సమయంలో షాట్ ఓకే అయిన తర్వాత నటీనటులు వెళ్లి తాము ఎలా చేశామో అని మానిటర్‌లో చూస్తుంటారు. ప్రతిసారీ వెళ్లి మానిటర్ చూడటం వల్ల సమయం వృథా అని నా భావన. మానిటర్ చూడటం డైరెక్టర్ పని. ఆయనకి సన్నివేశం బాగా వచ్చిందంటే ఓకే.. లేకుంటే మరో టేక్ చెబుతారు’’ అని శరత్ కుమార్ తెలిపారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.
ఈ సినిమాలో కీలకపాత్ర చేసిన శరత్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘నెనెప్పుడూ కథలో ముఖ్య భాగమయ్యేపాత్రలు చేయడానికే ఇష్టపడతాను. డైరెక్టర్ కీర్తీశ్వరన్ ‘డ్యూడ్’ కథ చెప్పినప్పుడు ప్రదీప్‌కి మావయ్యపాత్ర అన్నారు. నాపాత్ర కథలో చాలా కీలకం. ఒక కుటుంబంలో ఇలాంటి ఓ ఘటన జరిగితే సమాజం ఎలా స్పందిస్తుంది? అనే కోణంలో ‘డ్యూడ్’ని డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించారు. వినోదం, భావోద్వేగాలు కొత్తగా ఉంటాయి. నాపాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సెట్స్‌లో ఉన్నప్పుడు సీనియర్‌ని అనే ఆలోచనతో కాకుండా నేను కేవలం శరత్ కుమార్ అనే ఆలోచనతో ఉంటాను.
ఇంట్లో నేను, రాధిక, వరలక్ష్మి సినిమాల గురించి మాట్లాడుతుంటాం. వరలక్ష్మి ఇప్పుడు డైరెక్టర్ అవుతోంది. తన కథని రెండు మూడు రోజుల్లో వింటాను. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నోపాత్రలు చేశాను. అయితే సుభాష్ చంద్రబోస్‌గారి బయోపిక్ చేయాలని ఉంది. ఈ సినిమాకి నేనే దర్శకత్వం వహిస్తాను. ప్రస్తుతం ‘మిస్టర్ ఎక్స్’ సినిమా చేస్తున్నాను. బాలీవుడ్‌లో ఓ మూవీ, గౌతమ్ మీనన్‌తో ఒక సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు.