ఈ రోజుల్లో సినిమా తెరకెక్కించాలంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. చిన్న సినిమాలకు సైతం ఐదారు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అలాంటిది కేవలం రూ. 33 వేల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించాడు ఓ దర్శకుడు. ఇది నమ్మశక్యంగా లేకున్నా.. వందశాతం నిజం. షార్ట్ ఫిలిమ్స్ సైతం లక్షల బడ్జెట్‌తో తీస్తున్న ఈ రోజుల్లో..దర్శకుడు రాహి అనిల్ ఈ ప్రయోగం చేశాడు. కేవలం 33 వేలతోనే 80 నిమిషాల నిడివి ఉన్న సినిమాను తెరకెక్కించాడు.
రాహి అనిల్ ఎవరో కాదు.. తుంబాడ్, మంఝా, మాయాసభ లాంటి సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టింది ఈ దర్శకుడే. ఇప్పుడు మన్ పిశాచ్ పేరుతో రూపొందిన సైకాలజికల్ హారర్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. మార్చి 18న ఈ మూవీ యూట్యూబ్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు.
ఈ మూవీలో కేవలం ఇద్దరు నటులు(యానియా భరద్వాజ్, దీపక్ దమ్లే) మాత్రమే ఉన్నారు. ఐఫోన్ కెమెరాతో వీడియో తీసి.. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి అతి తక్కువ బడ్జెట్‌తో ఈ మూవీని తీర్చిదిద్దారు. ‘ఇది నా కొత్త ప్రయోగం. సాంకేతికత ఎలా సినిమాలను మారుస్తుందో చూపించాలని కోరాను’ అని డైరెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో ఏఐ ప్రభావం సినిమా రంగంపై ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పడానికి ఈ సినిమా ఓ మంచి ఉదాహరణ.


