
ఇటీవల అమరన్ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుని మదరాసి చిత్రంతో కమర్షియల్ సక్సెస్‌ను సాధించిన నటుడు శివకార్తికేయన్. ఈయన తాజాగా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఈయన నటిస్తున్న 25వ చిత్రం అన్నది గమనార్హం. నటుడు రవి మోహన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఇందులో నటుడు అధర్వ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. టాలీవుడ్‌లో క్రేజీ కథానాయకిగా గుర్తింపు పొందిన శ్రీలీల( Sreeleela) కోలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రం ద్వారా నేరుగా తమిళ ప్రేక్షకులకు ఆమె పరిచయం అవుతున్నారు. కాగా రాజకీయ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించబోతున్నారని సమాచారం. ఇంతకు ముందే వీరిద్దరి కాంబినేషన్‌లో డాన్ వంటి సూపర్ హిట్ చిత్రం రూపొందిందన్నది గమనార్హం. ఈ చిత్రం నవంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారట.టీ మూవీలో కూడా నటి శ్రీలీల కథానాయకిగా నటించనున్నట్లు గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే లేదు. ఇదే గనుక నిజం అయితే ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ శివకార్తికేయన్‌తో సినిమాలు చేసిన హీరోయిన్‌గా గుర్తింపు పొందుతుంది.