
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో ఆయన నటన చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. స్వయంగా దర్శకత్వం వహిస్తూనే ఇలా గొప్పగా నటించడం మామూలు విషయం కాదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు ప్రధాన బలం రిషబ్ శెట్టి మాత్రమేనని చెప్పవచ్చు. దీంతో ఏకంగా ఈ చిత్రం రూ. 500 కోట్ల క్లబ్‌లో మొదటి వారంలోనే చేరిపోయింది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ దర్శకుడు అట్లీ కుమార్ కాంతార చాప్టర్ 1పై ప్రశంసలు కురిపించారు. రిషబ్ శెట్టి మరోసారి జాతీయ అవార్డ్ అందుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇండియా టుడేతో అట్లీ మాట్లాడుతూ.. కాంతార గురించి ఇలా చెప్పారు. 'సినిమా విడుదలైనప్పుడు నేను ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్నాను. మొదటి రోజు సినిమా చూడటానికి సుమారు రెండున్నర గంటల పాటు కారులో వెళ్లాను. ఫైనల్‌గా ఫస్ట్ డే సినిమా చూశాను. థియేటర్ నుంచి వచ్చిన వెంటనే రిషబ్‌కు ఫోన్ చేసాను. అతను నాకు మంచి స్నేహితుడు. అతనంటే నాకు చాలా గౌరవం కూడా.. రిషబ్ శెట్టి చిత్రనిర్మాతలతో పాటు దర్శకులకు కూడా ఎంతోమందికి స్ఫూర్తి అని చెప్పగలను. కాంతార కోసం ఎవరూ చేయలేని పని అతను చేశారు. కాంతారలో నటించడమే కాకుండా దర్శకుడిగా పనిచేయడం అంటే సాధారణమైన విషయం కాదు. మరోకరికి ఇది సాధ్యం కాదని ఒక దర్శకుడిగా నేను చెప్పగలను. ఈ చిత్రంతో రిషబ్ తన నటనకు లేదా దర్శకుడిగా జాతీయ అవార్డ్ అందుకోవాలని ఆశిస్తున్నాను.' అని అట్లీ పేర్కొన్నారు.
2022లో విడుదలైన కాంతార చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్‌ను రిషబ్ శెట్టి అందుకున్నారు. అయితే, కాంతార చాప్టర్-1తో మరోసారి రిషబ్ నేషనల్ అవార్డ్ అందుకుంటారని దర్శకుడు అట్లీ పేర్కొన్నారు. 'జవాన్' చిత్రంతో బాలీవుడ్‌లో అట్లీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీతో ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ కూడా జాతీయ అవార్డ్ అందుకున్నారు.