
రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం కాంతార చాప్టర్-1. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. సూపర్ హిట్ మూవీ కాంతారకు ప్రీక్వెల్గా వచ్చిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. కర్ణాటకలోని ప్రాచీన కళ భూతకోల ఆధారంగా ఈ సినిమాలను తెరకెక్కించారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తకర విషయం బయటకొచ్చింది. ఈ మూవీ షూటింగ్ రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలోనే తెరకెక్కించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా దాదాపు 90 శాతం ఎడిటింగ్ తన ఊర్లోనే పూర్తి చేశామని రిషబ్ శెట్టి తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ ఈ విషయాన్ని పంచుకున్నారు. కాగా.. కర్ణాటకలోని ప్రత్యేక ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి, జానపద కథ నిర్మాణం కోసం రిషబ్ శెట్టి తన స్వగ్రామంలోనే ఎక్కువగా ఈ మూవీని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
రిషబ్ శెట్టి మాట్లాడుతూ..'ఈ సినిమా దాదాపు 90 శాతం పోస్ట్, ప్రొడక్షన్ పనులన్నీ మా సొంత గ్రామంలోనే జరిగాయి. మేము కేవలం మిగిలిన పదిశాతం పనికోసమే బెంగళూరు, కొచ్చికి వచ్చాం. ఈ సినిమా కోసం ఏకంగా సంగీత దర్శకుడిని కూడా గ్రామానికి తీసుకువచ్చి అక్కడే మొత్తం రికార్డింగ్ పూర్తి చేశాం. సినిమా ఎడిటింగ్‌లో దాదాపు 90 శాతం మా గ్రామంలోనే జరిగింది. మా గ్రామంలోని ప్రజలు పెద్దఎత్తున షూటింగ్ వద్దకు రావడంతో ఒకరకంగా ఫిల్మ్ టౌన్గా మారిపోయింది. ప్రతి రోజు కనీసం 100 వాహనాలు షూటింగ్కు వచ్చేవి. దాదాపు ప్రతి రోజు వెయ్యిమందిని సెట్లో ఉంచాం. కాంతార కోసమే నేను, నా భార్య, పిల్లలతో కలిసి నా స్వగ్రామానికి వెళ్లా' అని అన్నారు.
కాగా.. కాంతార: చాప్టర్ 1 కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు.