
రిషబ్ శెట్టి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతార: చాప్టర్1’. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా, గుల్షన్ దేవయ్య, జయరాం ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను రేపు (సెప్టెంబరు 22) రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించి, ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ప్రభాస్, హిందీ ట్రైలర్‌ను హృతిక్ రోషన్, తమిళ ట్రైలర్‌ను శివకార్తికేయన్, మలయాలం ట్రైలర్‌ను పృథ్వీరాజ్ సుకు మారన్‌లు డిజిటల్‌గా విడుదల చేయనున్నారు.
‘‘ఈ సినిమా కోసం 3వేలమంది ప్రజలు, 500 మంది యోధులు పాల్గొన్న ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కించాం. ఇందుకోసం 25 ఎకరాల స్థలంలో ఓ పట్టణాన్ని నిర్మించి, దాదాపు 50 రోజుల పాటు షూటింగ్ చేశాం. భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద సన్నివేశాల్లో ఈ యుద్ధ సన్నివేశం ఒకటిగా నిలుస్తుంది.
‘కాంతార’ (‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: ఛాప్టర్ 1’ చిత్రం తెరకెక్కింది) విజయాన్ని కొనసాగించడంలో హోంబలే ఫిలింస్ రాజీ పడటం లేదు. ఆడియన్స్‌కు థియేటర్స్‌లో గొప్ప అనుభూతిని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళ, తమిళ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ‘కాంతార: ఛాప్టర్ 1’ చిత్రం అక్టోబరు 2న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.