‘‘శ్రీనివాస్ మన్నెగారు చెప్పిన ‘ఈషా’ కథ విన్నప్పుడు షాకింగ్‌గా అనిపించింది. సినిమాలో ట్విస్టులు, సౌండ్ డిజైనింగ్ అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్‌కి మంచి అనుభూతినిచ్చే మూవీ ఇది. హారర్, థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి మా సినిమా కొత్త అనుభూతినిస్తుంది’’ అని అఖిల్ రాజ్ తెలిపారు. త్రిగుణ్, అఖిల్ రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు.
ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. అఖిల్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘రాజు వెడ్స్ రాంబాయి’ కంటే ముందు ఒప్పుకున్న సినిమా ‘ఈషా’. నేను చేసిన ‘సఖియా’ అనే వెబ్ సిరీస్ గ్లింప్స్ చూసి, దర్శకుడు శ్రీనివాస్‌గారు నన్ను ఆడిషన్ చేసి, ఈ చిత్రంలో వినయ్ పాత్రకి ఎంపిక చేశారు. అయితే ముందుగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ విడుదలైంది.
ఆ సినిమాలో నేను చేసిన రాజు పాత్రకి పూర్తి వైవిధ్యంగా ఉండే వినయ్ పాత్రను ‘ఈషా’లో చేశాను. దామోదర ప్రసాద్ సమర్పణ అనగానే ఎలాగైనా ఈ సినిమాలో భాగం కావాలనిపించింది. ఆయన, హేమ వెంకటేశ్వరరావుగార్లు రాజీ పడకుండా ఈ మూవీ నిర్మించారు. సినిమా పట్ల క్లారిటీ ఉన్న దర్శకుడు శ్రీనివాస్‌గారు. వంశీ నందిపాటి, బన్నీవాసుగార్లు ‘ఈషా’ విషయంలోనూ సక్సెస్ అవుతారని నమ్ముతున్నాను. ప్రస్తుతం తరుణ్ భాస్కర్, అనుపమగార్లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాను’’ అని చెప్పారు.


