పరిశ్రమ మౌనం వహించడం ఆందోళనకరం | Women Fire on Actor Sivaji Over His Comments on Women | Sakshi
Sakshi News home page

పరిశ్రమ మౌనం వహించడం ఆందోళనకరం

Dec 24 2025 1:52 AM | Updated on Dec 24 2025 1:52 AM

Women Fire on Actor Sivaji Over His Comments on Women

‘‘తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో పని చేస్తున్న వంద మందికిపైగా మహిళా నిపుణుల తరఫున మేము ఈ లేఖ రాస్తున్నాం’’ అంటూ నందినీ రెడ్డి, సుప్రియా యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మీ మంచు, ఝాన్సీ లక్ష్మీ అంటూ ‘మా’కి  లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... 

‘మా’ సభ్యునిగా ఉన్న శివాజీ ‘దండోర’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో, బహిరంగ వేదికపై హీరోయిన్ల దుస్తుల గురించి చేసిన వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇటువంటి వ్యాఖ్యలు అనుచితమైనవి మాత్రమే కాదు... ముఖ్యంగా సినిమా పరిశ్రమ నుండి ప్రయోజనం పొందుతున్నవాళ్లూ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులూ చేసినప్పుడు చాలా హానికరం. అతను ఉపయోగించిన ‘సామాన్లు, దరిద్రపు’ వంటివి అవమానకరమైన వి. అంతేకాదు... నటీమణులను బెదిరించినట్లు అయింది. ఇది బీఎన్‌ఎస్‌ 509 సెక్షన్‌ ప్రకారం మహిళలను అవమానించడంగా పరిగణించబడుతుంది. ఇది శిక్షార్హమైన నేరం. 

శివాజీ నుంచి బహిరంగ, షరతులు లేని క్షమాపణ కోరుతున్నాం.. లేకుంటే మేం తీవ్ర చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. మహిళల దుస్తులు, చీర లేదా ఇతరత్రా డ్రెస్సింగ్‌పై ఆంక్షలు విధించడం ఆమోదయోగ్యం కాదు. ఆధునిక, సృజనాత్మక పరిశ్రమలో దీనికి స్థానం లేదు. మహిళలు నిజమైన బెదిరింపులను ఎదుర్కొంటున్నప్పుడు పరిశ్రమ మౌనం వహించడం కూడా ఆందోళనకరమైనది. నటీమణులు నిధీ అగర్వాల్, సమంత ఇటీవల మూక దాడులకు గురైనప్పుడు సామూహిక ఆగ్రహం, జవాబుదారీతనం లేకపోవడం ఆందోళనకరమైనది.  ]

మహిళల భద్రతను గౌరవాన్ని ఉల్లంఘించినప్పుడు నిశ్శబ్ద ప్రతిస్పందన ఎందుకు ఉంది? క్షమాపణకు మించి మేము ‘మా’ నుండి స్పష్టమైన, జవాబుదారీతనం, చర్యను కోరుతున్నాం. ‘మా’ అసోసియేషన్‌ వెంటనే ఈ కింది చర్యలను రూపొందించి అమలు చేయాలని అభ్యర్థిస్తున్నాం.

కేవలం క్షమాపణలు మాత్రమే కాదు. ఈ విషయాలపై కూడా ‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ’ జవాబుదారీతనం వహిస్తుందని అనుకుంటున్నాము. అలాగే ‘మా’ అసోసియేషన్  ఈ క్రింది అంశాలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నాం’’ అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. 
వాయిస్‌ ఆఫ్‌ ఉమెన్  ప్రతినిధులు – నందినీ రెడ్డి, సుప్రియా యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మీ మంచు, ఝాన్సీలక్ష్మి

ఇదిలా వుంటే... శివాజీ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ వివాదం సద్దుమణిగింది అన్నట్లుగా ‘మా’ ఓ ప్రకటన విడుదల చేసింది.


ఇదేం చెత్త వాగుడు: శివాజీపై పలువురి ఫైర్‌
‘‘చాలా బాగుందమ్మా (యాంకర్‌ని ఉద్దేశించి) ముఖ్యంగా నీ డ్రెస్‌ సెన్స్‌ చాలా బాగుంది. ఇంకో విషయం చెబుతున్నాను. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందమ్మా... ఏమీ అనుకోవద్దు హీరోయిన్లందరూ. మీరు అనుకున్నా నాకు భయం లేదు. లాగి పెట్టి, పీకుతాం మనం. అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, నిండుగా కట్టుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే  ‘సామాను’ కనబడే వాటిలో ఏమీ ఉండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన  చాలామంది చూసినప్పుడు నవ్వుతూ ఉంటారు... కానీ ‘దరిద్రపు... (రాయడానికి వీలు లేని పదం)’ ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది? కాస్త మంచివి వేసుకోవచ్చు కదా... బాగుంటావు  అని అనాలనిపిస్తుంది కానీ అనలేం. అంటే... స్త్రీకి స్వేచ్ఛ లేదా అంటారు.

నేనిలా మాట్లాడితే... పెద్ద పెద్దోళ్లంతా సీక్త్రి స్వేచ్ఛ లేదని అంటారు. స్వేచ్ఛ అనేది అదృష్టం. మన గౌరవం మన దేశ భాషల నుంచే పెరుగుతుంది. ప్రపంచ వేదికల్లో కూడా చీర కట్టుకున్నవారికే విశ్వ సుందరి కిరీటం వచ్చింది’’ అంటూ సోమవారం సాయంత్రం జరిగిన ‘దండోరా’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. అమ్మాయిల దేహాన్ని ‘సామాను’ అనడం... ‘దరిద్రపు...’ అంటూ బహిరంగంగా అనడం పట్ల పాపులర్‌ యాంకర్‌–నటి అనసూయ, గాయని–అనువాద కళాకారిణి చిన్మయి, ప్రముఖ స్త్రీవాది కొండవీటి సత్యవతి స్పందించారు.

అలాగే, దర్శకురాలు నందినీ రెడ్డి, నిర్మాతలు స్వప్న దత్, సుప్రియ, నటి–నిర్మాత లక్ష్మీ మంచు, దర్శకురాలు నందినీ రెడ్డి, పాపులర్‌ యాంకర్‌ ఝాన్సీ తదితరులు శివాజీ నుంచి క్షమాపణ కోరాలంటూ ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’కి లేఖ రాశారు. ‘‘శివాజీ... ఏమిటా చెత్తవాగుడు’’ అంటూ సత్యవతి నిప్పులు చెరిగారు. ‘‘ఏంటా ధైర్యం? రాజకీయాల్లో ఉన్నామనా’’ అంటూ అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘శివాజీ హీరోయిన్లకు అనవసరమైన సలహా ఇచ్చాడు. వాళ్ల సామాను కవర్‌ చేసుకోవడానికి చీరలు కట్టుకోమంటున్నాడు.

అతనేమో జీన్స్, హుడీలు వేసుకుంటాడు. మరి... భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి, ధోతీలు కట్టుకోవచ్చుగా’’ అని చిన్మయి అతని మాటలను ఖండించారు.  ‘‘శివాజీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం... ఒకరి ప్రవర్తనతో గౌరవం లభిస్తుంది కానీ ధరించే దుస్తులతో కాదు... మహిళలు గౌరవించబడాలి’’ అంటూ ప్రముఖ హీరో మంచు మనోజ్‌ ఓ లేఖ వెలువరించారు. ఇలా శివాజీ చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున దుమారం రేగడంతో మంగళవారం సాయంత్రం ‘క్షమాపణ’ చెబుతూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.


శివాజీ మట్టెలు ధరించాలి: చిన్మయి
‘‘తెలుగు నటుడు శివాజీ నటీమణులను ‘దరిద్రపు... (రాయడానికి వీలు లేని పదం)’ వంటి అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారు తమ ‘సామాను’ను కప్పుకోవడానికి చీరలు ధరించాలని అనవసరమైన సలహాలు ఇస్తున్నాడు. శివాజీ ఒక అద్భుతమైన సినిమాలో విలన్ గా నటించి, చివరికి ఇన్సెల్‌ బాయ్స్‌కు హీరోగా మారిపోయాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే... వృత్తిపరమైన ప్రదేశాల్లో శివాజీ ‘దరిద్రపు...’ వంటి పదాలను ఉపయోగిస్తున్నాడు. శివాజీ జీన్స్, హుడీ ధరిస్తాడు. అయితే అతను ధోతీలు మాత్రమే ధరించి, భారతీయ సంస్కృతిని పాటించాలి... బొట్టు పెట్టుకోవాలి. అతను వివాహితుడని తెలిసేలా కంకణం, మెట్టెలు ధరించాలి. ఇక్కడ (ఫిల్మ్‌ ఇండస్ట్రీని ఉద్దేశించి కావొచ్చు) మహిళలను చూసే విధానం బాగాలేదు’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా గాయని చిన్మయి స్పందించారు.


నీ ఒంట్లో ఇంత కొవ్వేంది
ఏమిటా చెత్త వాగుడు శివాజీ? నువ్వేమో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ మా మా గురించి అవాకులు చవాకులు పేలతావా నీ ఒంట్లో ఇంత కొవ్వేంది మా బట్టల గురించి వాగడానికి నువ్వెవడివి చెప్పులు తేవాలా చెర్నాకోలా తేవాలా నిన్ను తన్ని తగలెయ్యడానికి అడ్డమైన వాళ్ళూ చెడ్డీలేసుకుని బయలుదేరుతారు సిగ్గూ ఎగ్గూ వదిలేసి అయినా నువ్వెవడివి మా గురించి తీర్పులు చెప్పడానికి మర్యాదగా చెంపలేసుకుని సారీ చెప్పు గుంజీళ్ళు తీసి మోకాళ్ళ మీద కూర్చుని క్షమాపణ అడుగు ఇంకెప్పుడూ ఇలా వాగనని నీకు నువ్వు ప్రమాణం చేసుకో మా జోలికొస్తే ఖబడ్దార్‌ బండకేసి ఉతికి ఆరేస్తాం. – కొండవీటి సత్యవతి ఎడిటర్, భూమిక, స్త్రీవాద పత్రిక


అలా అనడానికి ఎంత ధైర్యం?: అనసూయ
శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అనసూయ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక  ఇంటర్వ్యూలోని ముఖ్య విశేషాలు ...
నా లైఫ్‌లో హీరోల ఫ్యాన్స్‌ పేరుతో చేసిన ట్రోల్స్‌లో ముఖ్యంగా మూడు ఉన్నాయి. ఒకటి ‘అత్తారింటి దారేది’ (ఆ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ని గ్రూపుతో చేయలేనని రిజెక్ట్‌  చేశారు), రెండోది ‘అర్జున్‌ రెడ్డి’ (ఈ మూవీ పబ్లిక్‌ ఫంక్షన్‌లో ఆడవాళ్లపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు), మూడోది అంతకుముందు ‘గంగోత్రి’ (ఆ సినిమాలో అల్లు అర్జున్‌ తనకు నచ్చలేదని చెప్పడం). అయితే అప్పట్లో మెచ్యుర్టీ లేకుండా,  లౌక్యం లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన మాటలు అవి.

కానీ ఎవరి మీదా అయిష్టంతోనో, హిడెన్‌ ఎజెండాతోనో మాట్లాడిన మాటలు కావు. అప్పుడు నన్ను చాలా అగౌరవపరిచారు... పర్సనల్‌గా టార్గెట్‌ చేస్తూ, మెసేజ్‌లు పెట్టారు. అయితే నన్ను బాధపెట్టే విషయం ఏంటంటే... ఫ్యాన్స్‌ పేరుతో ట్రోల్స్‌ చేస్తున్నప్పుడు, అరాచకాలు చేస్తున్నప్పుడు ఎవరి ఫ్యాన్‌ అని వారు చెప్పుకుంటారో ఆ స్టార్‌ ఒక్క మాట చెబితే బాగుండేది. కానీ అలా ఎప్పుడూ జరగలేదు.

⇒ తొలి ్రపాధాన్యం కుటుంబానికే...
నాకు సినిమానే జీవితం కాదు... యాక్టింగ్‌ అంటే ఇష్టం... అంతే. నా తొలి ్రపాధాన్యం నా కుటుంబానికే. అందరూ ఆదర్శంగా తీసుకునేలా నా ఫ్యామిలీ లైఫ్‌ లీడ్‌ చేయాలనుకుంటాను. అందుకే కెరీర్‌కన్నా ఫ్యామిలీకి ్రపాధాన్యం ఇస్తాను. అవకాశాల కోసం ఎవరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ అలా చేసి, అవకాశాలు తెచ్చుకుంటే నాకు తృప్తిగా ఉండదు.

⇒ రెబల్‌ అనుకున్నా ఫర్వాలేదు
పిరికిగా ఉండే స్త్రీలనే మగవాళ్లు టార్గెట్‌ చేస్తారు. బోల్డ్‌గా ఉండే అమ్మాయిల గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తారు. ‘ఫేక్‌ ఫెమినిజమ్‌’ అని, ‘అటెన్షన్‌ సీకింగ్‌’లో భాగంగా ఇలా మాట్లాడుతున్నానని కూడా అంటారు. అయినా ‘నో ్రపాబ్లమ్‌’. నేను ఉమెన్‌ని కోరేది ఒక్కటే. పిరికిగా ఉండొద్దు. ధైర్యంగా బతకాలి. ‘రెబల్‌’ అనుకున్నా ఫర్వాలేదు... మన జోలికి ఎవరూ రారు.

⇒ ఆ జంతువులతో జాగ్రత్త
మనం అడవికి వెళ్లామనుకోండి... జంతువుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం జాగ్రత్తలు తీసుకుంటా కదా. అలాగే సమాజంలోని మగాళ్ల రూపంలో ఉండే కొన్ని జంతువులు ఉన్న చోట మనం (మహిళలు) ఉండాల్సినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మగవాళ్లల్లో మంచివాళ్లు చాలామంది ఉన్నారు. కానీ జంతువుల్లా ఉండేవాళ్లతో జాగ్రత్త. ఎందుకంటే వాళ్లు మనుషులు కాదు... సంస్కారం ఉండదు. జంతువులు కాబట్టి రెచ్చిపోతారు. అలాంటివాళ్లు ఉన్న చోట నా జాగ్రత్తలో నేను ఉంటాను.

⇒ మా అత్తగారింట్లో  నన్ను అర్థం చేసుకున్నారు
మా ఆయన బిహారీ. మా పెళ్లప్పటికి నేను సినిమా ఇండస్ట్రీలో లేను. మా అత్తగారింట్లో ‘గూంఘట్‌’ (ముసుగు) కల్చర్‌ ఉంది. కానీ నేను అలా ముసుగు వేసుకోవాలని వాళ్లు ఆశించలేదు. నేను మోడ్రన్‌గా ఉంటాను. అయితే నా వస్త్రధారణకు, నా మనస్తత్వానికి ఏమాత్రం సంబంధం లేదని మా మామగారు గ్రహించారు. నన్ను కూతురిలా చూసుకుంటారు. మా ఆయన నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటారు. మా ఇంట్లో నా చుట్టూ అలాంటి మగవాళ్లు ఉన్నారు. వేరే అమ్మాయిల జీవితాల్లోనూ ఇలా మంచి మగవాళ్లు ఉండాలన్నది నా ఆశ.

⇒ ధోతీ కట్టుకుని ఉండగలరా?
వస్త్రధారణ అనేది కంపర్ట్‌ కోసమే. ఇప్పుడు మగవాళ్ల దుస్తులు గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో పూజలు చేసినప్పుడు పట్టు ధోతీ కట్టుకుని చేస్తారు కదా... పూజ అయిపోగానే తీసేసి, ‘షార్ట్స్‌’ వేసుకుంటారు. మరి... ధోతీ కట్టుకుని గంటలు గంటలు ఉండమంటే వాళ్లు ఉంటారా? ఉండరు... ఎందుకంటే ధోతీ వారికి సౌకర్యం కాదు. మరి అమ్మాయిలు వాళ్ల కంఫర్ట్‌ గురించి ఆలోచించకూడదా? అయినా చీర కట్టుకో అంటారు... అసలు చీర కంటే ‘ఎక్స్‌పోజింగ్‌’ వేరే ఏ డ్రెస్‌లో ఉంటుంది?

⇒ అసలు ఆ పదం ఏంటి?
‘సామాను’ అనే పదం ఏంటి? ఆడవాళ్ల శరీర భాగాలను అలాపోల్చడానికి ఎంత ధైర్యం ఉండాలి? పైగా బహిరంగ వేదిక మీద ‘దరిదప్రు....’, ‘సామాను’ అనే పదాలు వాడటం ఎంత ధైర్యం? రాజకీయాల్లో ఉన్నామనే ధైర్యమా? వాళ్లకి కూతుళ్లు లేరా? అయినా వేరేవాళ్లకు తగ్గట్టుగా మన వస్త్రధారణ ఉండాలా? నేనేదో రెబలియస్‌గా మాట్లాడటం లేదు. అమ్మాయిలు కుక్కిన పేనులా ఉండాలని సీక్రెట్‌ ఎజెండాతో కొందరు మగవాళ్లు రూల్స్‌ పెట్టారు. కానీ, అమ్మాయిలను గౌరవించే మగవాళ్లు మన సమాజంలో చాలామంది ఉన్నారు. ప్రపంచంలో మంచి భాగస్వాములుగా ఉండే మగవాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్లని చూసినప్పుడల్లా ఆ జంతువుల్లాంటి మగవాళ్లు ఇలా ఎందుకు ఉండటంలేదు అనిపిస్తుంటుంది.

⇒ అక్కడ క్రైమ్‌ రేట్‌ తక్కువ
అమ్మాయిలు ధరించే దుస్తులే వారికిప్రోటెక్షన్‌ అంటే... అస్సలు కానే కాదు. నా కుటుంబంలో ఉన్న మగవాళ్లు ప్రోటెక్ట్‌ చేస్తారు... కానీ రక్షణ పేరుతో కంట్రోల్‌ చేయాలనుకోలేదు. కొన్ని దేశాలు ఉన్నాయి... అక్కడ క్రైమ్‌ రేట్‌ చాలా తక్కువ. ధరించే దుస్తులతో సంబంధం లేదు. ఆ దేశాల్లో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మరి... మనకు ఎందుకీ పక్షపాతం?

నాకు ఇద్దరు మగపిల్లలున్నారు. ఒక తల్లిగా వాళ్లకి మంచి ప్రపంచం ఉండాలని కోరుకుంటాను. చేతకాని మగవాళ్లందరూ ఆడవాళ్లను హర్ట్‌ చేస్తుంటారు. అందుకే మా అబ్బాయిలు నాకంటే ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ధైర్యంగా ఉండే మగవాళ్లు హర్ట్‌ చేయాలనుకోరు. వాళ్లకి ఇన్‌సెక్యూర్టీ ఉండదు కాబట్టి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement