ఇటీవల శునకాలను తుదముట్టించడాన్ని నిరసిస్తూ నటి రేణూ దేశాయ్ నిర్వహించిన ప్రెస్ మీట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తారల్లో అత్యధికులు శునకాభిమానులే. వీరు పెట్స్‌ను పెంచుకోవడం మాత్రమే కాదు వాటికి ఎంత విలువు ఇస్తారంటే తమ ఇంటిపేరు తగిలించి మరీ వాటికి నామకరణం చేసి తమ ఫ్యామిలీ మెంబర్‌లా కలిపేసుకుంటారు. అయితే వారి ఈ రేంజ్ శునకాభిమానానికి నోచుకునేవి స్ట్రీట్ డాగ్స్ కాదు...మంచి పేరున్న బ్రీడ్స్. ఈ నేపధ్యంలో పలు సందర్భాల్లో స్వయంగా తామే పంచుకున్న తారల పెట్ ప్రేమ గురించిన విశేషాలివి...

– ఫ్రెంచ్ బుల్ డాగ్స్ తో తాను ప్రేమలో పడ్డానని తరచు చెబుతుంది సమంత. ఆమెకు హాష్ సాషా అనే రెండు పెట్స్ ఉన్నాయి. తన ప్రియమైన పెంపుడు జంతువులతో సరదాగా గడిపే క్షణాలను ఆమె తరచుగా తన అభిమానులకు అందిస్తుంది. ఇటీవల హోలీ రోజున హోలీ ఆడిన తర్వాత తన పెంపుడు జంతువులతో ఆడుకుంటున్న వీడియోను పంచుకుంది

– అలాగే టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ కు సైబీరియన్ బ్రీడ్ హస్కీ పెట్ ఫ్రెండ్. ఆయన దానికి స్ట్రోమ్ దేవరకొండ అంటూ తన ఇంటిపేరు కలిసొచ్చేలా పేరు పెట్టాడు. ఆయన ప్రియురాలు, నేషనల్ క్రష్ రష్మికకు విజయ్ దేవరకొండ తో పాటు ’ఆరా’ అనే తన పెంపుడు శునకం మీద కూడా క్రష్ ఉంది

–ఇక మెగాస్టార్ వారసుడు రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసనలు ఇద్దరూ పెట్ లవర్సే. మొదట్లో రామ్ చరణ్ కు బ్రాట్ అనే పిలుచుకునే బ్లాక్ల్ లాబ్రడార్ ఉండేది అయితే కొన్ని సంవత్సరాల క్రితం దానిని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఉపాసన ఆయనకు ఒక పెట్‌ను బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం ఈ జంటకు రైమ్ అనే ముద్దుల పెట్ ఉంది. జాతి ప్రకారం ఫ్రెంచ్ బార్బెట్ లాగా ఈ రైమ్, కనిపిస్తుంది, ఈ జంట తమ పెట్స్‌తో గడిపే చిత్రాలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటుంది వీలున్నంత వరకూ వీరి పెట్ కూడా వీరితో కలిసి ప్రయాణాలు చేస్తుంది. తద్వారా విమానాశ్రయాల్లో ఫొటోలకు చిక్కి స్టార్స్ సరసన మీడియాలో పబ్లిసిటీ కూడా దక్కించుకుంటుంది. షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తాను చేసే మొదటి పని తన పెట్ ఎలా ఉందో చూడటమే అంటాడు రామ్ చరణ్. 
తన పెంపుడు జంతువును చూసినప్పుడల్లా ఓదార్పు ఓ పాజిటివ్ వైబ్ తక్షణమే లభిస్తుందని దానితో ఉన్నప్పుడు తన నిజమైన భావోద్వేగాలు బయటకొస్తాయంటున్న పెద్ది... తనపెట్‌తో కలిసి ఈత కొట్టడం తనకెంతో ఇష్టమంటున్నాడు.

– దక్షిణాది సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ దగ్గర పలు పెట్స్ ఉన్నాయి. ఆమె తన పెట్స్‌తో పాటు వీధి కుక్కల పట్ల కూడా ప్రేమను పంచుతుంది. శునకాలను ప్రేమించడం మాత్రమే కాదు, వాటిని రక్షించేందుకూ అనుష్క శెట్టి పనచేస్తుంటుంది. ఆమె పెంపుడు కుక్కలతో పాటు, బ్లూ క్రాస్ పెట్ కార్నివాల్‌లో నిర్వహించిన కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. తన నిజమైన ఓదార్పు తన పెంపుడు జంతువులతో సమయం గడపడంలోనే లభిస్తుందని అనుష్క చెప్పింది.
అదే విధంగా కాజల్ అగర్వాల్ ఎంతో ప్రేమించే పెట్ పేరు సీజర్. ఆమెకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఇక దానితోనే గడుపుతుంది. టాలీవుడ్ నటుడు మంచు మనోజ్‌కు జ్యూస్ అనే పెంపుడు శునకం ఉంది దానిని తరచుగా తనతో బయటకు తీసుకు వెళుతుంటాడు. బహిరంగంగా దానిపై తన ప్రేమను ప్రదర్శిస్తూ కనిపిస్తాడు. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు దగ్గర మనోజ్ షికార్లు చేస్తూన్న ఫొటోను కూడా అతను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఆయన సోదరి నటి లక్ష్మీ మంచు కూడా ’చందమామ కథలు’ అనే సినిమా ద్వారా తన పెంపుడు కుక్క జ్యూస్ ఆనంద్ మంచును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది.

సిద్ధార్థకు మురికివాడలో దొరికిన కొడుకు...
హీరో సిద్ధార్థ్ ఇటీవల ఓ ట్వీట్ చేశాడు.. ’నాకు ఒక కొడుకు ఉన్నాడు, అతనికి నాలుగు కాళ్లు వంకర తోక ఉన్నాయి. అతని పేరు మౌగ్లీ. ప్రస్తుతం అతనికి 10 సంవత్సరాలు, నేను అతన్ని ఒక మురికివాడలో కష్టాల నుంచి ఒకసారి రక్షించాను తను తన నిస్సారమైన ప్రేమ ఆప్యాయతతో ఎప్పుడూ నన్ను రక్షిస్తున్నాడు. అతను ఒక మంచి శునకం. ప్రపంచంలోనే అత్యంత పిరికివాడు కూడా, అయితే ఆ పిరికితనాన్ని బిగ్గరగా మొరగడం ద్వారా దాస్తుంటాడు’’ అంటూ తన పెట్ గురించిన కబుర్లు పంచుకున్నాడు.


