
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే పేరు హాట్ టాపిక్. కేవలం రెండంటే రెండే సినిమాలతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోనయి, జాతీయ అవార్డు సహా కలెక్షన్ల రికార్డులు కూడా అందుకుంటూ ఒక్కసారిగా భారతీయ సినిమా ప్రభంజనానికి కేంద్ర బిందువుగా నిలిచిందా పేరు. ప్రస్తుతం ప్రతీ సినీ అభిమాన ప్రేక్షకుడికీ చిరపరిచితమైన ఆ పేరు రిషబ్ శెట్టి(Rishab Shetty). అయితే నిజానికి అది ఆయన అసలు పేరు కాకపోవడం విశేషం. మన భారతదేశ సంప్రదాయాలు, ఆధ్యాత్మికత, భక్తి, విశ్వాసాలు, దైవ బలం ఇలాంటివి తన కాంతారా, కాంతారా చాప్టర్ 1(kantara: Chapter 1) చిత్రాల ద్వారా బలంగా చాటి చెప్పిన రిషబ్ ఆ సినిమాకు కేవలం కధానాయకుడు మాత్రమే కాదనీ అన్నీ తానే అయి నడిపించిన దర్శకుడు కూడా అనేది మనకు తెలుసు.
అయితే కోస్తా కర్ణాటకలోని ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అతను నటుడిగా చిత్ర నిర్మాతగా అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకున్నాడు. ప్రతిభావంతుడైన నట దర్శకుడు రిషబ్ శెట్టి తన సినిమాల ద్వారా ప్రవచించిన ఆధ్యాత్మిక విశ్వాసాలు కేవలం వ్యాపార మెళకువలు అనుకుంటే పొరపాటు. ఆయన తూచ తప్పకుండా నమ్మే, అనుసరించేవి కూడా. అది ఆయన స్వంత ఇంటి అలంకరణ దగ్గర నుంచి ఆయన తన వంటిని అలంకరించుకునే తీరు, వస్త్రధారణలో కూడా అది ప్రస్ఫుటమవుతుంది.
ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1 విజయాన్ని సవినయంగా స్వీకరిస్తూ ఆస్వాదిస్తున్న రిషబ్ పేరు మార్పు వెనుక కూడా ఆయన నమ్మే జ్యోతిష్యశాస్త్ర ప్రభావం ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ‘నేను నా పేరు ఎందుకు మార్చుకున్నాననే దాని వెనుక ఓ కథ ఉంది. నా అసలు పేరు ప్రశాంత్ శెట్టి. అదే పేరుతో సినిమా పరిశ్రమకు ప్రవేశించాను. అయితే సినిమా ఇండస్ట్రీలో తొలి నాళ్లలో నాకు ఎలాంటి విజయం లేదా సినిమాలు రాలేదు‘ అని చెప్పాడు.
అదే సమయంలో తనను పేరు మార్చుకోమని అలా చేస్తే విజయాలు, మంచి అవకాశాలు వస్తాయని తన తండ్రి సూచించాడని ఆయన వెల్లడించాడు. అప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పెద్ద స్టార్లు తమ పేర్లు మార్చుకున్నారనే విషయం కూడా తాను విన్నానని చెప్పాడు. దాంతో తాను కూడా అలాగే చేయాలని నిర్ణయించుకున్నానని రిషబ్ శెట్టి తెలిపాడు.
పేరు మార్పు తన కెరీర్‌లో మంచి విజయాన్ని తెస్తుందని తన తండ్రి గట్టిగా నమ్మారని ఆయనే తన పేరును రిషబ్‌గా మార్చమని సూచించినట్టు వివరించాడు. విశేషం ఏమిటంటే రిషబ్ షెట్టి గా పేరు మార్చిన తండ్రే ప్రశాంత్ షెట్టి అనే పేరు కూడా పెట్టడం. మరో విశేషం రిషబ్ తండ్రి స్వయంగా జ్యోతిష్కుడు కావడం. ఏదేమైనా ప్రతిభా సామర్ధ్యాలకు తోడైన పేరు మార్పు కూడా తనను ఇలా శిఖరాగ్రానికి చేర్చిందని రిషబ్ షెట్టి నమ్ముతున్నాడనేది నిస్సందేహం.