
ప్రముఖ నటుడు అజ్మల్ అమీర్ (Ajmal Ameer) అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్పింగ్ నెట్టింట వైరల్‌గా మారింది. హద్దులు దాటి మాట్లాడటంతో పాటు చాటింగ్ కూడా చేశాడంటూ ప్రచారం జరిగింది. ఈ వివాదంపై అజ్మల్ స్పందించాడు. అవన్నీ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఫేక్ వీడియో కాల్స్ అని కొట్టిపారేశాడు.
నాకు పీఆర్ లేదు
అజ్మల్ మాట్లాడుతూ.. ఈ కల్పిత కథలు, ఏఐ వాయిస్ ఇమిటేటింగ్, ఎడిటింగ్స్.. నన్ను కానీ, నా కెరీర్‌ను కానీ నాశనం చేయలేవు. దేవుడి దయ వల్ల రెండు పెద్ద (తెలుగు, తమిళ) ఇండస్ట్రీలలో నేనేంటో నిరూపించుకోగలిగాను. నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాను. నా ఇమేజ్‌ను కాపాడేందుకు నాకెటువంటి మేనేజర్ లేడు, పీఆర్ అసలే లేదు. రెండురోజులుగా నా గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది.
సినిమా
ఇలాంటి సమయంలో నాకు అండగా నిలబడ్డ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీవల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరే నా ధైర్యం అని వీడియో రిలీజ్ చేశాడు. అజ్మల్ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 14 అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. రంగం మూవీతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. రచ్చ, అభినేత్రి 2, వ్యూహం, బడ్డీ, గోట్(The Greatest of All Time) వంటి పలు సినిమాలతో అలరించాడు.