
దసరా సందర్భంగా 'కాంతార ఛాప్టర్ 1' థియేటర్లలోకి వచ్చేసింది. కన్నడలో దీనికి ఎలానూ పోటీ లేదు. తెలుగు, హిందీలోనూ చెప్పుకోదగ్గ సినిమాలేం థియేటర్లలోకి రాలేదు. ఈ క్రమంలోనే దీనికి పోటీ అనేది లేకుండా పోయింది. దానికి తోడు తొలిరోజు దాదాపు అన్నిచోట్ల హౌస్‌ఫుల్స్ పడ్డాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు మూవీ చూసేందుకు ఎగబడ్డాయి. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయి?
విడుదలకు ముందు కర్ణాటకలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలుగా 'కాంతార 1' నిర్మాణ సంస్థ హైకోర్టుని ఆశ్రయించింది. తీర్పు వీళ్లకు అనుకూలంగా రావడంతో ధరలు బాగానే పెంచారు. తెలంగాణలో పెంపు లభించలేదు గానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గరిష్ఠంగా రూ.100 వరకు పెంపు లభించింది. అన్ని చేసినా సరే తొలిరోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు కూడా దాటలేదు.
దేశవ్యాప్తంగా తొలిరోజు 1.28 మిలియన్ల టికెట్స్ బుక్ మై షోలో సేల్ అయ్యాయి. ఈ క్రమంలో భారత్ మొత్తం కలిపి రూ.66 కోట్ల వసూళ్లు రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో 'ఓజీ', 'కూలీ' తర్వాత ఇది అత్యధికం. ఏమైనా ప్రస్తుత బాక్సాఫీస్ దగ్గర జోష్ చూస్తుంటే వీకెండ్ అయ్యేసరికి లాభాల్లోకి వచ్చేయడం గ్యారంటీ అనిపిస్తుంది.
'కాంతార' విషయానికొస్తే.. మొదటి పార్ట్‌లో హీరో తండ్రి ఎక్కడైతే మాయమవుతాడో సరిగ్గా అక్కడి నుంచే 'కాంతార చాప్టర్ 1' కథ మొదలవుతుంది. 8వ శతాబ్దంలో కాదంబుల రాజ్యానికి ఓ దిక్కులోని కాంతార అనే ప్రాంతం ఉంటుంది. అందులోని ఈశ్వరుడి పూదోటకు అనే దైవిక ప్రదేశముంటుంది. ఆ ప్రాంతాన్ని కాంతార గిరిజన తెగ చాలా జాగ్రత్తగా కాపాడుతుంటారు. అక్కడున్న బావిలో ప్రజలకు ఓ బిడ్డ దొరుకుతాడు. అతనికి బెర్మి (రిషబ్ శెట్టి) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తారు.
అయితే కాంతారలోనే ఉండే బెర్మి.. అనుకోని పరిస్థితుల కారణంగా ఓసారి బాంగ్రా రాజ్యానికి వెళ్తాడు. స్వయానా రాజుతోనే కయ్యం పెట్టుకుంటాడు. దీంతో బాంగ్రా రాజు రాజశేఖరుడు (జయరామ్)తో బెర్మికి వైరం ఏర్పడుతుంది. తర్వాత ఏమైంది? ఈ స్టోరీలో యువరాణి కనకావతి(రుక్మిణి వసంత్) సంగతేంటి? ఈశ్వరుడి పూదోటలో ఉన్న దైవ రహస్యం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగిలిన స్టోరీ.
