చైతో పెళ్లి తర్వాత ఫస్ట్‌ మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్‌ | Sobhita Dhulipala Announce Cheekatilo Movie OTT Release Date | Sakshi
Sakshi News home page

శోభిత కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలో రిలీజ్‌.. ఎప్పుడంటే?

Jan 8 2026 1:55 PM | Updated on Jan 8 2026 2:51 PM

Sobhita Dhulipala Announce Cheekatilo Movie OTT Release Date

హీరోయిన్‌ శోభిత ధూళిపాళ సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత తన మొదటి సినిమాను ప్రకటించింది. ఈ సినిమా పేరు "చీకటిలో". ఇది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో చీకటిలో మూవీ జనవరి 23 నుంచి ప్రసారం కానున్నట్లు పేర్కొంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు  పోస్ట్‌ పెట్టింది.

థ్రిల్లర్‌ మూవీలో శోభిత
ఈ మేరకు చీకటిలో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు. ఇందులో శోభిత తలకు హెడ్‌ఫోన్స్‌ పెట్టుకోగా ఎదుట మైక్‌ ఉంది. బహుశా తను రేడీయో జాకీ అయి ఉండవచ్చు. ఆమె పాత్ర పేరు సంధ్య అని వెల్లడించారు. హీరోయిన్‌ వెనకాల ఏదో నేరానికి సంబంధించిన విచారణ తాలూకు సెటప్‌ ఉంది. దీన్ని బట్టి ఇది సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అని ఇట్టే తెలిసిపోతుంది.

పెళ్లి తర్వాత మొదటి మూవీ
కాగా శోభిత ధూళిపాళ.. 2024లో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఎటువంటి సినిమా ప్రాజెక్టు ప్రకటించలేదు. ఇప్పుడు సడన్‌గా చీకటిలో ఫస్ట్‌ లుక్‌, రిలీజ్‌ డేట్‌ ప్రకటించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. చీకటిలో సినిమాలో విశ్వదేవ్‌ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, జాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీని డి.సురేశ్‌ బాబు నిర్మించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించాడు. మరి ఈ థ్రిల్లర్‌ తెలుగు మూవీలో శోభిత ఎలా మెప్పిస్తుందో చూడాలి! 

 

చదవండి: నా కూతురికి కష్టపడాల్సిన అవసరమే లేదు: చిరంజీవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement