
కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంటే మనసు ఎప్పుడూ ఆనందంలో మునిగి తేలుతుంది. నటి రుక్మిణి వసంత్ ఇప్పుడు అలాంటి ఆనందంలో తేలిపోతున్నారు. 2019లో మాతృభాషలో కథానాయకిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ కన్నడ బ్యూటీ ఆ తరువాత హిందీలో అప్‌స్టార్ట్స్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలుగులోకి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ దిగుమతి అయిన ఈమె తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా ఏస్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు.
ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, శివకార్తికేయన్ సరసన నటించిన మదరాసీ చిత్రం విజయానందాన్నిచ్చింది. కాగా ప్రస్తుతం కన్నడం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె కన్నడంలో రిషబ్ శెట్టితో నటించిన కాంతార. చాప్టర్ 1 చిత్రం అక్టోబర్ 2న పాన్ ఇండియా చిత్రంగా తెరపైకి రానుంది. దీనితో పాటూ యష్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్‌తో పాటు తెలుగులో ఎన్టీఆర్ సరసన డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక భేటీలో రుక్మిణి వసంత్ పేర్కొంటూ తనను నటిగా అంగీకరించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటానన్నారు.
కాంతార చాప్టర్ 1 తనకు చాలా ముఖ్యమైన చిత్రం అన్నారు. తన నటనను చూసిన రిషబ్ శెట్టి అద్భుతం అన్న అభినందనను జీవితంలో మరిచిపోలేనన్నారు. అదే విధంగా అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు తన మనసు ఎల్లలు లేని ఆనందంలో మునిగితేలుతోందన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని భగవంతుని వేడుకుంటున్నానని నటి రుక్మిణి వసంత్ పేర్కొన్నారు. మొత్తం మీద ఈ అమ్మడి కెరీర్ మంచి జోష్‌లో సాగుతోందన్నమాట.