
ఎంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజం. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరుకుతుందా, ట్రోల్ చేద్దామా అని చూస్తుంటారు. రాజమౌళి లాంటి దర్శకులు దీనికి భయపడి ఏళ్లపాటు సినిమాని ఫెర్ఫెక్ట్‌గా వచ్చే వరకు తీస్తుంటారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు 'కాంతార 1'లో చాలా పెద్ద పొరపాటుని నెటిజన్లు బయటపెట్టారు. ఆ సంగతి ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది.
2022లో వచ్చిన 'కాంతార' సినిమాని ప్రస్తుతం జరుగుతున్నట్లు తీశారు. రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన 'కాంతార ఛాప్టర్ 1'ని మాత్రం 16వ శతాబ్దంలో జరిగే కథగా తెరకెక్కించారు. అందుకు తగ్గట్లే అడవిలో సెట్ వర్క్ గానీ, పాత్రధారుల కాస్ట్యూమ్స్ గానీ ప్రతిదీ చాలా చక్కగా చూపించారు. కానీ ఒక్కచోట మాత్రం మూవీ టీమ్ దొరికిపోయింది. అందరూ దీన్ని కనిపెట్టకపోవచ్చు గానీ కొందరు నెటిజన్లు మాత్రం తప్పుని పట్టేశారు.
(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)
సెకండాఫ్‌లో 'బ్రహ్మకలశ' అనే పాట ఉంటుంది. గూడెంలో ఉండే దేవుడిని రాజు ఉండే చోటుకి తీసుకొచ్చే సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. ఈ పాటలో కాంతార అలియాస్ రిషభ్ శెట్టి తమ దేవుడిని తలపై పెట్టుకుని తీసుకురావడం, తర్వాత స్నానమాచరించి పూజలు చేయడం.. ఇలా అంతా చూపించారు. అయితే అందరూ కలిసి కింద కూర్చుని భోజన చేస్తున్న సన్నివేశంలో మాత్రం ఓ చోట 20 లీటర్ల ప్లాస్టిక్ క్యాన్ కనిపించింది. షూటింగ్ చేస్తున్నప్పుడు దీన్ని అక్కడి నుంచి తీయడం మర్చిపోయినట్లున్నారు. అది ఇప్పుడు మూవీలో, రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన వీడియో సాంగ్‌లో కనిపించింది.

వీడియో సాంగ్‌లో సరిగ్గా 3:06 నిమిషాల ఈ పొరపాటుని మీరు గమనించొచ్చు. దీన్ని మరీ అంతలా ట్రోల్ చేయడం లేదు గానీ ఫన్నీగానే 16వ శతాబ్దంలో వాటర్ క్యాన్ ఎలా వచ్చిందబ్బా అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: Bigg Boss 9: వైల్డ్ కార్డ్స్ చేతిలో 'పవర్'.. ఆరోవారం నామినేషన్స్ లిస్ట్)