
మొన్నటివరకు సినిమా అంటే కచ్చితంగా నటీనటులు ఉండాలి, భారీ బడ్జెట్ పెట్టాలనేది అందరికీ తెలిసిన విషయం. కానీ 'మహావతార్ నరసింహా'.. దీన్ని బ్రేక్ చేసింది. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. మొత్తం యానిమేషన్‌తో తీసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ తరహా యానిమేషన్‌తో ఇప్పుడు మహాభారతంలోని కురుక్షేత్ర ఘట్టానికి దృశ్యరూపం ఇచ్చారు. అలా 'కురుక్షేత్ర' పేరుతో వెబ్ సిరీస్‌గా ఓటీటీలోకి వచ్చింది.
(ఇదీ చదవండి: Bigg Boss 9: వైల్డ్ కార్డ్స్ చేతిలో 'పవర్'.. ఆరోవారం నామినేషన్స్ లిస్ట్)
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఉజాన్ గంగూలీ దర్శకుడు. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని 18 ఎపిసోడ్స్‌గా తెరకెక్కించారు. ఛాప్టర్-1 పేరుతో ఇప్పుడు తొమ్మిది ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా.. ఈనెల 24న మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్ విడుదల చేయనున్నారు. మరి 'కురుక్షేత్ర' తొలి సీజన్ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.

'కురుక్షేత్ర' కథేంటి?
అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత పాండవులకు ఇచ్చిన మాట ప్రకారం కౌరవులు.. రాజ్యంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మాట తప్పుతారు. ఐదుగురికి ఐదు ఊళ్లు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. కృష్ణుడి సూచన మేరకు పాండవులు ఓపిగ్గానే ఉంటారు. సంజయుడితో కౌరవులకు రాయబారం పంపిస్తారు. కానీ అది విఫలమవుతుంది. కౌరవులు.. యుద్ధం పట్ల ఉత్సాహంగా ఉన్నారనే విషయం పాండవులకు తెలుస్తుంది. దీంతో కృష్ణుడు, అర్జునుడు వైపు.. కృష్ణుడి సైన్యం దుర్యోధనుడికి దక్కుతుంది. అలా 'కురుక్షేత్రం' మొదలవుతుంది. ఆయుధాలే పట్టనని అనుకున్న అర్జునుడు.. కృష్ణుడి గీతోపదేశం తర్వాత ఎలా మారాడు? ఈ యుద్ధంలో అసలేం జరిగిందనేది అసలు కథ?
ఎలా ఉందంటే?
మహాభారతం అంతులేని సబ్జెక్ట్. ఎంత చెప్పినా అస్సలు తరగదు. దీనిపై ఇప్పటికే పలు సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. జనాలని అలరించాయి. నెట్‌ఫ్లిక్స్ మాత్రం 18 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని మాత్రమే తీసుకుని ఈ 'కురుక్షేత్ర' సిరీస్ తీసింది. ఒక్కముక్కలో చెప్పాలంటే అదిరిపోయింది. ముందే యానిమేటెడ్ సిరీస్ అని చెప్పేశారు కాబట్టి ఓ అంచనా ఉంటుంది. దాన్ని అందుకోవడంలో ఏ మాత్రం తగ్గలేదు. గ్రాఫిక్స్, తెలుగు డబ్బింగ్, కథని చెప్పే విధానం.. ఇలా ప్రతిదీ టాప్ రేంజులో ఉన్నాయి.
(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))
అయితే ఉన్నది ఉన్నట్లు చెబితే చూసే ప్రేక్షకుడికి బోర్ కొట్టొచ్చు. అందుకే ఓవైపు యుద్ధాన్ని చూపిస్తూనే మరోవైపు ఫ్లాష్ బ్యాక్స్ కూడా చూపిస్తూ ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించారు. కౌరవుల దగ్గరకెళ్లి సంజయుడి రాయబారం చేసే సీన్స్‌తో తొలి ఎపిసోడ్ మొదలవుతుంది. రెండో ఎపిసోడ్‍కి యుద్ధం ప్రారంభమైపోతుంది. అక్కడి నుంచి భీష్ముడి మరణం, పద్మవ్యూహంలో బంధించి అభిమన్యుడిని కౌరవులు చంపడం, జయద్రధుడిని అర్జునుడు సంహరించే సీన్.. ఇలా గూస్ బంప్స్ ఇచ్చే సన్నివేశాలతో ఆద్యంతం అలరించేలా తీశారు.
మహాభారతంలో పాత్రలు చాలా ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ ఈ సిరీస్‌లో చాలా సులభంగా గుర్తుపెట్టుకునేలా అన్ని పాత్రల్ని తీర్చిదిద్దారు. ఎలాంటి సాగదీత లేకుండా క్లియర్ కట్‌గా సీన్స్ అన్ని చూపించారు. కాస్ట్యూమ్స్ గానీ కోటలు, రాజభవనాలు గానీ.. యుద్ధ సన్నివేశాలు గానీ ప్రతిదీ టాప్ క్వాలిటీతో తెరకెక్కించారు. తెలుగు డబ్బింగ్ కూడా ఫెర్ఫెక్ట్‌గా ఉంది. ఇప్పటి జనరేషన్‌కి మహాభారతం, కురుక్షేత్రం గురించి అస్సలు తెలియకపోవచ్చు. వాళ్లు గానీ ఈ సిరీస్ చూస్తే థ్రిల్ కావడంతో పాటు చాలా విషయాలు తెలుసుకుంటారు కూడా!
ఈ సిరీస్‌లో మిగిలిన పాత్రల సంగతేమో గానీ కర్ణుడు పాత్ర చూస్తున్నప్పుడు మాత్రం ప్రభాస్ పోలికలు కనిపిస్తాయి. మరి మేకర్స్ కావాలని పెట్టారా లేదంటే అలా కుదిరేసిందో? ఏదేమైనా రీసెంట్ టైంలో 'మహాభారతం' ఆధారంగా సినిమాలు గానీ సిరీస్‌లు గానీ రాలేదు. ఓ రకంగా ఈ విషయం ఈ సిరీస్‌కి చాలా ప్లస్ పాయింట్. టైమ్ ఉంటే మాత్రం ఓటీటీలో ఉన్న ఈ జెమ్‌ని అస్సలు మిస్ కావొద్దు
- చందు డొంకాన
(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా)