
ఓటీటీల్లోకి వచ్చే మలయాళ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా ఈ ఇండస్ట్రీ నుంచి వస్తుంటాయి. కానీ అప్పుడప్పుడు ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీస్ కూడా వస్తుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'హృదయపూర్వం'. గత నెలలో థియేటర్లలో రిలీజై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు హాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉంది? చూడొచ్చా లేదా?
కథేంటి?
సందీప్ బాలకృష్ణన్(మోహన్ లాల్) కొచ్చిలో క్లౌడ్ కిచెన్ నడుపుతుంటాడు. ఇతడికి గుండె సమస్య. ఓ రోజు పుణెలో ఉండే కర్నల్ రవీచంద్రన్ ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఈయన గుండెని వైద్యులు.. సందీప్‌కి అమర్చుతారు. తర్వాత కొన్నిరోజులకు సందీప్ దగ్గరకు వచ్చిన కర్నల్ కూతురు హరిత(మాళవిక మోహనన్).. తన నిశ్చితార్థానికి రమ్మని ఆహ్వానిస్తుంది. అలా సందీప్.. పుణె వెళ్తాడు. అక్కడికి వెళ్లాక ఎదురైన పరిస్థితులు ఏంటి? రెండు రోజులు అనుకున్నది కాస్త రెండు వారాలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఇప్పుడొస్తున్న చాలా సినిమాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి. కానీ ఈ చిత్రం ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. చెప్పుకోవాలంటే ఇందులో పెద్దగా కథేం ఉండదు కానీ పరిస్థితులకు తగ్గట్ల వచ్చే సింపుల్ కామెడీ, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్.. ఫెర్ఫెక్ట్ మూవీ చూశాం అనే ఫీలింగ్ కలిగిస్తాయి.
సాధారణంగా అవయవాల ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే మాటని అప్పుడప్పుడు వింటుంటాం. అలా ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి గుండెని హీరోకి అమర్చుతారు. చెప్పుకొంటే ఇది సీరియస్ సబ్జెక్ట్. కానీ దర్శకుడు దీన్ని ఓ అందమైన ప్రయాణంలా చూపించాలని ఫిక్సయ్యాడు. ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు.
కర్నల్ గుండెని సందీప్‌కి అమర్చడంతో కథ నేరుగా మొదలవుతుంది. తర్వాత సందీప్ చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూపిస్తారు. అనంతరం జెర్రీ అనే నర్స్‌తో కలిసి పుణె వెళ్లడం, అనుకోని పరిస్థితుల్లో హరిత నిశ్చితార్థం ఆగిపోవడం.. ఇలా స్టోరీలో సంఘర్షణ ఏర్పడుతుంది. అప్పటివరకు కామెడీగా వెళ్తున్నది కాస్త రొమాంటిక్ టర్న్ తీసుకుంటుంది. హరిత, అతడి తల్లి చూపించే కేరింగ్ హీరోకి మరోలా అర్థం కావడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. చివరకొచ్చేసరికి ఎమోషనల్‌గా ముగించిన తీరు ఆకట్టుకుంటుంది.

ప్రారంభంలో మొహమాటం, కాస్తంత అమాయకత్వం ఉన్న సందీప్... గుండె అమర్చిన తర్వాత పరిస్థితుల కారణంగా ఎలా మారుతాడు. చివరకు ధైర్యం, ముక్కుసూటితనం లాంటివి ఎలా నేర్చుకుంటాడు అనే విషయాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందులో హీరో హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరు. మోహన్ లాల్ పాత్ర అతి సామాన్యంగా ఉంటుంది. హరిత, ఆమె తల్లి పాత్రలు కూడా మన చుట్టూ మనుషుల్లానే అనిపిస్తారు.
సందీప్ బాలకృష్ణన్ పాత్రని మోహన్ లాల్ సటిల్డ్‌గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హరితగా మాళవిక మోహనన్ అందంగా ఉంది. జెర్రీగా సంగీత్ ప్రతాప్, సందీప్ బావగా సిద్ధిఖీ కామెడీ చేసే బాధ్యత తీసుకున్నారు. వీళ్లతో పాటు మిగతా పాత్రధారులందరూ ఏ మాత్రం అతి చేయకుండా చాలా సహజంగా నటించారు. చూస్తున్నంతసేపు ఓ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ రానంత సహజంగా అనిపిస్తుంది. పాటలు, సెకండాఫ్‌లో వచ్చే మెలోడ్రామా కాస్త సాగదీతగా అనిపిస్తుంది. తప్పితే ఓవరాల్‌గా మూవీ భలే అనిపిస్తుంది. కుటుంబంతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.
- చందు డొంకాన