
థ్రిల్లర్ సినిమాల్లో మీరు చూసిన బెస్ట్ అంటే ఏం చెబుతారు? తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది 'దృశ్యం' అంటారు! ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ చూపించింది మరి. ఒకవేళ దాన్ని మించిపోయే మూవీ ఉంటే?.. ఏంటి అలాంటి సినిమా ఉందా? ఎక్కడ చూడాలి? ఏ భాషలో ఉంది అని కచ్చితంగా అడుగుతారు. అందుకే మీ కోసం మెంటలెక్కించే ఓ కొరియన్ థ్రిల్లర్‌ని తీసుకొచ్చేశాం. అదే 2017లో వచ్చిన 'ఫర్గాటెన్'. ఇంతకీ దీని సంగతేంటి? అంత బాగుందా అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
జిన్ సోక్ (కాంగ్ హా న్యుల్).. తన అమ్మ, నాన్న, అన్నయ్యతో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతాడు. కొన్నిరోజులకే కుటుంబమంతా ఇంట్లో సెట్ వాతావరణానికి సెట్ అయిపోతారు. జిన్‌కి మాత్రం ఇంట్లోని ఓ గది నుంచి వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. పీడకలలు వస్తుంటాయి. ఓ రోజు జిన్ అన్నయ్య యో సూక్(కిమ్ మ్యు యోల్)ని ఇతడి కళ్ల ముందే కొందరు కిడ్నాప్ చేస్తారు. పోలీస్ కేసు పెట్టినా లాభముండదు. కానీ 19 రోజుల తర్వాత యో సూక్ తిరిగి క్షేమంగా ఇంటికొచ్చేస్తాడు. తిరిగొచ్చిన అన్నయ్యతో పాటు తల్లిలోనూ జిన్ కొన్ని మార్పులు గమనిస్తాడు. భయమేసి ఇంట్లో వాళ్ల నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. విచారణ మొదలవుతుంది. అసలు ఇంతకీ జిన్ ఎవరు? ఇద్దర్ని హత్య చేసి గతాన్ని ఎందుకు మర్చిపోయాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు అనగానే చాలామందికి ఓ ఐడియా ఉంటుంది. కానీ 'ఫర్గాటెన్' అలాంటి వాటితో పోలిస్తే చాలా డిఫరెంట్. ఎందుకంటే సినిమా మొదలవడమే ఓ ఫ్యామిలీ స్టోరీలా అనిపిస్తుంది. చక్కని కుటుంబం. అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు. ఏం జరుగుతుందా? ఎలాంటి థ్రిల్ ఇస్తుందా అని చిన్న ఆసక్తి. అలా చూస్తుండగానే కాసేపటికి హారర్ మూవీలా చిన్నగా భయపెడుతుంది. హీరో కుటుంబం ఏదో తేడాగా ఉందే అనిపిస్తుంది. దీంతో మన హీరో పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. ఇక అక్కడి మొత్తం సీన్ మారిపోతుంది.
ఎక్కడైనా సినిమాలో ట్విస్టులు ఉంటాయి. 'ఫర్గాటెన్'లో మాత్రం ట్విస్టులు మధ్య సినిమా ఉందా అన్నట్లు సాగుతుంది. అప్పటివరకు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకుడికి.. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఇదెక్కడి మాస్ రా మావ అనిపిస్తుంది. ఇక హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్ చేస్తుంది. అదే టైంలో హత్యలు చేయడానికి దారితీసిన పరిస్థితులు, ఆ సంఘటనని మర్చిపోవడం.. ఇలా ఒక్కో సీన్ చూస్తుంటే ఇది కదా మనకు కావాల్సిన థ్రిల్లర్ అని కచ్చితంగా అనిపిస్తుంది.

అదే టైంలో తొలుత చూపించిన సన్నివేశాల్ని, చివర్లో ఒక్కొక్కటిగా లింక్ చేసిన విధానం చూస్తే భలే ముచ్చటేస్తుంది. రెండు గంటల్లోపే ఉన్న ఈ సినిమా క్రేజీ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడం గ్యారంటీ. ఒకవేళ చూడకపోతే మాత్రం ఇప్పుడే చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. కాకపోతే కొరియన్ భాషలో మాత్రమే ఆడియో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు. తెలుగు లేదు కదా అని అనుకుని స్కిప్ చేస్తే మాత్రం ఓ మంచి సినిమా మిస్ అవుతారు.
ఈ సినిమాలో స్టోరీని చూపించే విధానంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ కూడా అద్భుతం అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ అంతా కాస్త నెమ్మదిగా ఉంటుంది గానీ చివరికొచ్చేసరికి అవేం గుర్తుండవు. అదిరిపోయే సినిమా చూశాం ఈ రోజు అనే అనుభూతి మాత్రమే మిగులుతుంది. ఒకటి రెండు సన్నివేశాలు మినహా ఫ్యామిలీతోనూ చూడొచ్చు.
- చందు డొంకాన