
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత 'కాంతార' ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా థియేటర్లలోకి వచ్చింది. అదే 'కాంతార ఛాప్టర్ 1'. తొలి పార్ట్ కంటే ఈసారి భారీ హంగులు, స్టోరీలో మరిన్ని ఎలిమెంట్స్ జోడించారు. దసరా కానుకగా అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో రిలీజైంది. అయితే ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కొందరు ప్రేక్షకులు ఆహా ఓహో అంటుండగా.. మరికొందరు మాత్రం ఓకే ఓకే అని అంటున్నారు.
మరోవైపు తొలి పార్ట్ కేవలం రూ.15-20 కోట‍్లతో నిర్మిస్తే ఏకంగా రూ.400 కోట్ల వరకు కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు మాత్రం భారీగా బడ్జెట్ పెట్టారు. ఏకంగా రూ.125 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ప్రతి సీన్‌లోనూ రిచ్‌నెస్ కనిపించింది. అడవిలో సెట్ కావొచ్చు, బాంగ్రా రాజ్యం సెట్ కావొచ్చు స్క్రీన్‌పై అద్భుతంగా కనిపించాయి. కంటెంట్‌తో పాటు విజువల్స్, సెట్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.
(ఇదీ చదవండి: Kantara Review: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ)
ఈ సినిమా రెమ్యునరేషన్ విషయానికొస్తే తొలి పార్ట్ కోసం హీరో, దర్శకుడిగా చేసినందుకు రిషభ్ శెట్టి అప్పట్లో కేవలం రూ.4 కోట్లు తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈసారి మాత్రం రూపాయి పారితోషికం తీసుకోకుండానే దాదాపు మూడేళ్ల పాటు కష్టపడ్డాడని అంటున్నారు. అలా అని ఫ్రీగా ఏం చేసేయలేదు. రిలీజ్ తర్వాత లాభాల్లో వచ్చే వాటాని తీసుకోవాలని ముందే నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నాడట.
సినిమాలో రిషభ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య లీడ్ రోల్స్ చేశారు. వీళ్లందరికీ తలో రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. వీళ్లు తప్పితే అందరూ పెద్దగా పేరున్న యాక్టర్స్ అయితే కనిపించలేదు. అయితే సినిమాలో అటు రిషభ్ ఇటు రుక్మిణి వసంత్ యాక్టింగ్ జనాలకు బాగా నచ్చుతోంది. పబ్లిక్ టాక్‌లోనూ ఎక్కువ మంది వీళ్లిద్దరినే మెచ్చుకుంటుండటం విశేషం.
(ఇదీ చదవండి: కొడుకుని పరిచయం చేసిన వరుణ్ తేజ్.. పేరు ఏంటంటే?)