సెలబ్రిటీలను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని కొందరు వెంటపడుతుంటారు. చాలామటుకు తారలు ఈ ప్రపోజల్స్ చూసి ఓ నవ్వు నవ్వి వదిలేస్తారు. కొందరు మాత్రం అందులోని తీవ్రతను, పిచ్చిని సోషల్ మీడియా వేదికగా ఎండగడతారు. తాజాగా మలేషియాకు చెందిన ఓ నటి, మోడల్‌కు కూడా వింత ప్రపోజల్ వచ్చిందట!
వింత ప్రపోజల్
29 ఏళ్ల మోడల్ అమీ నుర్ టినీ ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా తనకు వీవీఐపీ (అత్యంత ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తి/ప్రముఖుడు) నుంచి ఓ ప్రపోజల్ వచ్చిందని తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. 'అతడికి మూడో భార్యగా ఉంటే నాకు ఓ బంగ్లా, లగ్జరీ కారు, పది ఎకరాల స్థలం రాసిస్తానన్నాడు. అంతేకాకుండా నా ఖర్చుల కోసం నెలకు రూ.11 లక్షలు ఇస్తానన్నాడు.
మూడో భార్యగా ఉండమని..
అతడి మాటలు విని షాకయ్యా.. ఈ ఆఫర్ తిరస్కరించాను. నేను కార్పొరేట్ ఈవెంట్స్‌కు యాంకరింగ్ కూడా చేస్తుంటాను. ఆ సమయంలో కొందరు ప్రముఖులు నా ఫోన్ నెంబర్ అడుగుతారు, ఇంటికి రమ్మని పిలుస్తారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన మూడో భార్యగా ఉండమని కోరాడు. అతడికి దాదాపు నా తండ్రి వయసు ఉంటుంది. అతడి పిచ్చి ప్రపోజల్‌కు నేను వెంటనే నో చెప్పేశా' అని చెప్పుకొచ్చింది.
అమ్మ కౌంటర్
గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో ఈ సంఘటన గురించి అమీ ప్రస్తావించింది. అందాల పోటీల్లో పాల్గొనేందుకు అతడు సాయం చేస్తానని ముందుకు వచ్చాడు. కాకపోతే పెళ్లి చేసుకోమని షరతు పెట్టాడు. అప్పుడు మా అమ్మ ఒక్కటే సమాధానమిచ్చింది.. నేను నా కూతుర్ని అమ్మదల్చుకోలేదని గట్టిగా బదులిచ్చింది అని పేర్కొంది.


