
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార ఛాప్టర్-1 రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్ల మార్క్ దాటేసిన ఈ సినిమా పదో రోజు కూడా అదే జోరును కొనసాగిస్తోంది. సెకండ్ వీకెండ్ కలిసి రావడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో ఇండియన్ మూవీగా నిలిచింది. పదో రోజు శనివారం ఒక్క రోజే రూ.37 కోట్ల నికర వసూళ్లు సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా రూ. 396.65 నెట్ వసూళ్లు రాగా.. రూ.476 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే రజనీకాంత్ కూలీ, సైయారా, వార్-2 లాంటి రీసెంట్ హిట్ సినిమాలను అధిగమించింది.
మొదటి రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేయనుంది. అయితే ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ఛావా కంటే వెనకే ఉంది. కాంతారా చాప్టర్ -1 ప్రపంచవ్యాప్తంగా చూస్తే పది రోజుల్లోనే రూ.560 నుంచి రూ.590 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన కూలీ(రూ.518 కోట్లు), టైగర్ జిందా హై (రూ.558 కోట్లు), ధూమ్ 3 (రూ.558 కోట్లు) సైయారా (రూ.570 కోట్లు), పద్మావత్ (కూ.585 కోట్లు), సంజు (రూ.589 కోట్లు) లాంటి లైఫ్‌టైమ్ గ్రాస్ కలెక్షన్స్ కూడా దాటేసినట్లే అవుతుంది. దీంతో ఈ సినిమా త్వరలోనే ఆరు వందల మార్క్ చేరుకునే అవకాశముంది.
ఈ మూవీని 2022లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ కాంతారకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు.