
టైటిల్: మిన్నల్ మురళి
నటీనటులు- టొవినో థామస్,గురు సోమసుందరం, అజు వర్గీస్, సాజన్
సంగీతం: సుశీన్ శ్యామ్, షాన్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: సమీర్ తాహిర్
ఎడిటింగ్: లివింగ్‌స్టోన్ మాథ్యూ
దర్శకత్వం: బాసిల్ జోసెఫ్
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
ఓటీటీల్లో చిత్రాలకు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ ఉంటోంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకైతే ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. అలా వచ్చి ఓటీటీలో సూపర్ హిట్‌గా నిలిచిన మిన్నల్ మురళి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
సినీ ఇండస్ట్రీలో గతంలో సూపర్ మ్యాన్ తరహాలో చాలా సినిమాలొచ్చాయి. ఇలాంటి చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ చిత్రాలు ఎక్కువగా హాలీవుడ్, బాలీవుడ్‌లోనే ఎక్కువగా వస్తుంటాయి. అయితే మలయాళ సినీ పరిశ్రమ ప్రేక్షకులకు ఆ స్థాయి ఎక్స్‌పీరియన్స్ వచ్చే సినిమాను తీసుకొచ్చింది. టొవినో థామస్ ప్రధాన పాత్రలో వచ్చిన మిన్నల్ మురళి ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంది. అసలు మిన్నల్ మురళి కథేంటి? అతను సూపర్ హీరో ఎలా అయ్యాడో చూసేద్దాం.
మిన్నల్ మురళి కథేంటంటే..
అనంతపురంలోని ఉరవకొండ గ్రామంలో నివసించే జేసన్ (టొవినో థామస్ ఓ టైలర్. కానీ చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఓ పెద్దాయన అతన్ని చేరదీస్తాడు. అతని జీవిత లక్ష్యం అమెరికా వెళ్లడమే. అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే క్రమంలో పోలీస్ ఆఫీసర్ కూతురిని ప్రేమించి విఫలమవుతాడు. అయితే అదే గ్రామంలో హోటల్‌లో పని చేసే శిబు (గురు సోమసుందరం), జేసన్ (టోవినో థామస్) ఒకరోజు మెరుపు దాడి(పిడుగుపాటు) గురవుతారు. ఆ సమయంలో వీరిద్దరికీ ఊహించని శక్తులు వస్తాయి. మరీ ఆ శక్తులను వాళ్లు ఎలా ఉపయోగించారు? మంచి కోసం వాడారా? వీరి వల్ల ఆ గ్రామ ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడ్డారు? అన్నది తెలియాలంటే మిన్నల్ మురళి చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సూపర్ హీరో ఒక్కరే ఉంటే.. అతను విలన్ అంతం చేయడమనేది ఉంటుంది. కానీ ఇద్దరికీ ఓకే రకం పవర్స్ ఉంటే సరాసరి పోరాటం ఉంటుంది. అదే ఈ మిన్నల్ మురళి. తెరపై ఇద్దరు సూపర్ హీరోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హాలీవుడ్‌లో మార్వెల్, డీసీ కామిక్స్ లాంటి ఎందరో సూపర్ హీరోలను మనం చూశాం. కానీ ఇండియా సినీ చరిత్రలో ఇద్దరు సూపర్ హీరోల పాత్రలు అరుదనే చెప్పలి. జేసన్ తన అమెరికా కల కోసం పోరాటం.. శిబు తన ప్రియురాలి కోసం ఆరాటం.. ఈ క్రమంలోనే తమ సూపర్ పవర్‌ని ఎలా ఉపయోగించారనే స్టోరీని అద్భుతంగా తెరకెక్కించాడు బాసిల్ జోసెఫ్.
ఈ సూపర్‌హీరో కథను ఇండియన్ ఆడియన్స్‌కు అర్థమయ్యేలా రూపొందించడంలో బాసిల్ జోసెఫ్ సక్సెస్ అయ్యారు. ఈ మూవీలో జేసన్ కంటే శిబు పాత్ర హైలెట్‌గా అనిపిస్తుంది. లేటు వయసులో తన ప్రియురాలి కోసం చేసే పోరాటం ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. కానీ శిబు లవ్ స్టోరీ మాత్రం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తుంది. చివరికీ క్లైమాక్స్‌లో ఇద్దరు సూపర్ హీరోల పోరాటం సీట్ నుంచి కదలకుండా చేస్తుంది. ఇద్దరు సూపర్ హీరోలను ఒకరికి తెలియకుండా ఒకరి కథను తీసుకెళ్లిన విధానం బాగుంది. ఈ సూపర్ హీరోల స్టోరీలో ఎమోషనల్ టచ్ ఇవ్వడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కథ నెమ్మదిగా సాగడం.. కొన్ని సీన్స్ ముందుగానే ప్రేక్షకులు ఊహించేలా ఉండడం మైనస్.
ఎవరెలా చేశారంటే..
మలయాళ హీరో టొవినో థామస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సూపర్‌హీరో పాత్రలో టొవినో ఒదిగిపోయాడు. మరో సూపర్ హీరో గురు సోమసుందరం శిబు పాత్రలో మెప్పించాడు. ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా ఫర్వాలేదు. సుశీన్ నేపథ్య సంగీతం.. సమీర్ సినిమాటోగ్రఫీని ఓకే అనిపించాయి. ఈ వీకెండ్ ఓటీటీల్లో సినిమా చూసేవారు మిన్నల్ మురళిపై ఓ లుక్కేయొచ్చు.