
కన్నడ నటి రుక్మిణీ వసంత్ ఒక హీరోయిన్‌గా మాత్రమే అందరికీ తెలుసు. కానీ, ఆమె దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ కూతురు అని కొందరికి మాత్రమే తెలుసు. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. పఠాన్‌కోట్, సిక్కిం, రాంచీ, జమ్మూ కాశ్మీర్ వంటి కీలక ప్రదేశాల్లో ఆయన సేవలు అందించారు. అయితే, రుక్మిణీకి ఏడేళ్ల వయసు ఉన్న సమయంలో దేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలారు. ఈ సంఘటన రుక్మిణీ జీవితంలో ఒక మలుపు. అందుకే ఆమె తన తండ్రి పేరు ఎప్పటికీ గుర్తుండేలా రుక్మిణీ వసంత్‌గా మార్చుకుంది.

రుక్మిణీ తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ 2007లో మరణించారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి ప్రాంతంలోకి చొచ్చుకుని వస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను అడ్డుకుంటూ ఆయన వీరమరణం పొందారు. భారీ ఆయుధాలతో 8 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ఒక ట్రక్ సాయంతో భారత్‌లోకి ప్రవేశించారు. దానిని గమనించిన వసంత్ టీమ్ వారిని అడ్డుకుంది. ముఖ్యంగా రుక్మిణీ తండ్రి తన ప్రాణాలను పణంగా పెట్టి వారిని ఎదుర్కొన్నారు. చొరబడిన ఉగ్రవాదులను పూర్తిగా హతమార్చే వరకు ఆయన పోరాడారు. ఈ క్రమంలో ఆయన శరీరంలోకి సుమారు 7కు పైగా తూటాలు దిగాయి. కొన ఊపిరితో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన ధైర్యసాహాసాలను మెచ్చి అశోక చక్ర పతకంతో భారత ప్రభుత్వం గౌరవించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ పతకం అందుకున్న మొదటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
రుక్మిణీ తండ్రి ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్‌లో కఠణమైన శిక్షణ పొందారు. అందుకే 9 మరాఠా లైట్ త్రిదళంలో సెకండ్ లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు. ఇలా ఆయన ఇండియన్ ఆర్మీలో చాలా కీలకంగా పనిచేశారు. వసంత్ వేణుగోపాల్ మరణం తర్వాత.., ఆయన భార్య సుభాషిణి వసంత్ "వీర్ రత్న ఫౌండేషన్" అనే సంస్థను స్థాపించి యుద్ధ వీరుల భార్యలు, కుటుంబాలను ఆదుకుంటున్నారు. తన వంతుగా ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. సుమారు 120కి పైగా కుటుంబాలకు చెందిన పిల్లల చదువు కోసం ఆమె పాటు పడుతున్నారు.