అక్టోబర్‌లో అదరహో | Tollywood Movies Releasing In Theatres In October 2025 | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లో అదరహో

Oct 5 2025 12:47 AM | Updated on Oct 5 2025 12:47 AM

 Tollywood Movies Releasing In Theatres In October 2025

డజను సినిమాలతో థియేటర్లు కళకళ

చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు సంక్రాంతి సరైన పండగ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పందెం కోళ్లులాగా సంక్రాంతి బరిలో నిలిచేందుకు హీరోలు, దర్శక–నిర్మాతలు తెగ ఆసక్తి చూపుతుంటారు. ఈ కారణంగానే సంక్రాంతికి భారీపోటీ ఉంటుంది. సంక్రాంతి తర్వాత దసరా, దీపావళి పండగలు  తమ సినిమాల విడుదలకు మంచి సమయం అని మేకర్స్‌ ఆలోచన. ఈ ఏడాది దసరా, దీపావళి పండగలు అక్టోబరులోనే రావడం విశేషం. సో.. సినిమా ప్రేమికులకు ఈ నెల సినిమాల పండగే అని చెప్పాచ్చు.

ఈ నెల ఆరంభంలో ‘ఇడ్లీ కొట్టు, కాంతారా: చాప్టర్‌ 1’ వంటి డబ్బింగ్‌ సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఈ నెలలోనే రవితేజ ‘మాస్‌ జాతర’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రియదర్శి ‘మిత్ర మండలి’, ప్రదీప్‌ రంగనాథన్‌ ‘డ్యూడ్‌’, కిరణ్‌ అబ్బవరం ‘కె.ర్యాంప్‌’, సాయికుమార్, అనసూయ ‘అరి’, రక్షిత్‌ అట్లూరి ‘శశివదనే’ వంటి పలు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదే విధంగా ప్రభాస్‌ ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి. ‘బాహుబలి: ది ఎపిక్‌’గా  ఆడియన్స్‌ ముందుకు రానుంది. ఇవి మాత్రమే కాదు... ఇంకా పలు చిత్రాలు విడుదల కానున్నాయి.  ఆ వివరాల్లోకి వెళదాం.

బాహుబలి: ది ఎపిక్‌ 
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్‌ హీరోగా, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌ ముఖ్య తారలుగా నటించారు. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ 2015 జూలై 15న, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్‌’ 2017 ఏప్రిల్‌ 28న రెండు భాగాలుగా విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు పలు రికార్డులు, రివార్డులు సాధించింది.

‘బాహుబలి: ది బిగినింగ్‌’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. తొలి, ద్వితీయ భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్‌’ పేరుతో ఈ నెల 31న రిలీజ్‌ చేస్తున్నారు. ఇండియాలోనే కాదు... ఇంటర్‌నేషనల్‌ వైడ్‌గా ఈ చిత్రాన్ని రీ–రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని ఇప్పటికే విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా ఎన్ని గంటలు ఉంటుంది? ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుంది? అనే వివరాలు తెలియాలంటే విడుదల వరకూ వేచి చూడాలి.

థియేటర్లలో జాతర  
రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మాస్‌ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు. రవితేజ నటించిన 75వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో క్రేజ్‌ నెలకొంది. పైగా ‘ధమాకా’ (2022) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్‌ శ్రీలీల ‘మాస్‌ జాతర’లో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా ఈ నెల 31 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

‘‘రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ‘మాస్‌ జాతర’ రూపొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలిచారు భాను భోగవరపు. ‘ధమాకా’ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్‌ అందించిన భీమ్స్‌ సిసిరోలియో మరోసారి రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ‘మాస్‌ జాతర’ కోసం సూపర్‌ మ్యూజిక్‌ అందించారు. మా సినిమా థియేటర్లలో అసలు సిసలైన మాస్‌ పండగను తీసుకురాబోతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది.  

మనసు హత్తుకునే తెలుసు కదా! 
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌’ చిత్రాల ఫేమ్‌ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’.ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటించగా, వైవా హర్ష కీలక పాత్రపోషించారు. స్టైలిస్ట్‌ నీరజ కోన ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయవుతున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.

‘‘మోస్ట్‌ ఎవైటెడ్‌ మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘తెలుసు కదా’. మనసుని హత్తుకునే కథ, స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలు ప్రేక్షకులని అలరిస్తాయి. నీరజ కోన యునిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇటీవల విడుదల చేసిన మా మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తమన్‌ మ్యూజిక్‌ మా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్‌ తెలిపారు.  

ప్రేమ, వినోదాల ర్యాంప్‌  
‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణుకథ, క’ చిత్రాల ఫేమ్‌ కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘కె ర్యాంప్‌’. జైన్ ్స నాని రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ బ్యానర్‌లపై రాజేశ్‌ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.

‘‘లవ్, రొమాన్ ్స, యాక్షన్, ఫన్‌తో కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘కె–ర్యాంప్‌’. కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లో ఈ చిత్రం మరో ఫ్రెష్‌ అటెంప్ట్‌ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే వాణిజ్య అంశాలు మా సినిమాలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మా టీజర్‌ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది.. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మా చిత్రం ఉంటుంది. చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం మా మూవీకి ప్లస్‌ అవుతుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  

నవ్వులు పంచే మిత్ర మండలి  
‘బలగం, కోర్ట్‌’ చిత్రాల ఫేమ్‌ ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. నూతన దర్శకుడు విజయేందర్‌ ఎస్‌. దర్శకత్వం వహించారు. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన నిహారిక ఎన్‌ఎం ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. బ్రహ్మానందం, రాగ్‌ మయూర్, ప్రసాద్‌ బెహ్రా ప్రధాన పాత్రలుపోషించారు. బీవీ వర్క్స్‌(బన్నీ వాసు) సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్మెంట్స్‌పై కల్యాణ్‌ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.

‘‘స్నేహం ప్రధానంగా నడిచే కథతో రూపొందిన చిత్రం ‘మిత్ర మండలి’. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఏ ఒక్కర్ని కూడా మా చిత్రం నిరుత్సాహపరచదు. ఆర్‌ఆర్‌ ధృవన్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అంటూ పేర్కొన్నారు మేకర్స్‌.

తండ్రీ కొడుకుల అనుబంధం  
‘పలాస 1978, నరకాసుర, ఆపరేషన్‌ రావణ్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రక్షిత్‌ అట్లూరి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్‌ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కోమలి ప్రసాద్‌ హీరోయిన్‌. తమిళ నటుడు శ్రీమాన్‌ కీలక పాత్రపోషించారు. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్‌ కంపెనీ, ఎస్‌.వి.ఎస్‌ స్టూడియోస్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌ రెడ్డి గోడల నిర్మించారు.

ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘‘తండ్రీ కొడుకుల అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘శశివదనే’. ఇలాంటి కథా నేపథ్యం ఉన్న చిత్రం ఇదివరకు రాలేదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ప్రేక్షకులను నిరాశపరచదు. ఓ మంచి సినిమా చూశామనే అనుభూతితో ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటకు వస్తారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  

దీపావళికి డ్యూడ్‌  
‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్‌ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్‌’. ఈ సినిమాలో శరత్‌ కుమార్‌ కీలక పాత్రపోషించారు. ఈ మూవీ ద్వారా కీర్తీశ్వరన్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ‘‘రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘డ్యూడ్‌’.  న్యూ ఏజ్‌ కథాంశంతో పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. సాయి అభ్యంకర్‌ అందించిన అద్భుతమైన మ్యూజిక్‌ ఆడియన్స్‌ని అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

సమాజానికి సందేశం 
సాయి కుమార్, అనసూయ భరద్వాజ్, వినోద్‌ వర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్‌ ఈజ్‌ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్‌ బాయ్‌’ మూవీ ఫేమ్‌ జయశంకర్‌ దర్శకత్వం వహించారు. ఆర్వీ సినిమాస్‌ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్‌వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్‌ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏషియన్‌ సురేష్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ రిలీజ్‌ చేస్తోంది. ‘‘మా సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వనున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే వాణిజ్య 
అంశాలున్న మా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం తెలిపింది.  

పోలీస్‌ కానిస్టేబుల్‌ 
‘కొత్త బంగారు లోకం’ మూవీ ఫేమ్‌ వరుణ్‌ సందేశ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్‌’. ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్‌ పై బలగం జగదీష్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో వరుణ్‌ సందేశ్‌పోలీస్‌ కానిస్టేబుల్‌ పాత్రపోషించారు.

సుభాష్‌ ఆనంద్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్‌..’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ని హైదరాబాద్‌ మాజీపోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా ఈ నెలలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్‌ మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement