కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో సత్తా చాటిన చిత్రం ‘హోమ్‌బౌండ్’... ఇప్పుడు అస్కార్-2026లో కూడా దూసుకుపోతుంది. ఇషాన్ కట్టర్, విశాల్ జైత్య, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘హోమ్ బౌండ్’. హైదరాబాదీ ఫిల్మ్ మేకర్ నీరజ్ ఘైవాన్ తెరకెక్కించారు. కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. అయితే, ఆస్కార్ విడుదల చేసిన తాజా షార్ట్ లిస్ట్‌లో ఈ మూవీకి చోటు దక్కింది. కేవలం రెండు అడుగుల దూరంలో ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకునేందుకు ఈ మూవీ సిద్ధంగా ఉంది.
ఆస్కార్ ఎంపికలో ఎంతో కీలకమైన ఘట్టం షార్ట్‌లిస్ట్ జాబితానే అని చెప్పాలి. ఇందులో మన సినిమా హోమ్బౌండ్ చోటు దక్కించుకుంది. తాజాగా ఈ విషయాన్ని ఆస్కార్ అకాడమీ అధికారికంగా ప్రకటించింది. భారతీయ సినీ రంగంలో మరో మైలురాయిగా సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు. ‘ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్’ విభాగంలో 15 చిత్రాలను ఎంపిక చేసి ఒక షార్ట్‌లిస్ట్‌ను విడుదల చేశారు.
అందులో బాలీవుడ్ చిత్రం ‘హోమ్బౌండ్’ కూడా ఉంది. అయితే, తుది జాబితాను జనవరి 22న ప్రకటించనున్నారు. అప్పుడు కూడా టాప్-5 మాత్రమే ఎంపిక చేస్తారు. మార్చి 15న జరిగే ఆస్కార్ వేడుకలో ఈ ఐదు చిత్రాలలో ఏదైన ఒక చిత్రానికి అవార్డ్ ఇస్తారు. మరో రెండుగుల దూరంలో ఆస్కార్ సొంతం చేసుకునేందుకు హోమ్బౌండ్ ఉంది.

నిజ సంఘటన ఆధారంగా...
ఈ సినిమాను నిజ జీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు నీరజ్ ఘెవాన్ తీశాడు. 2020లో న్యూయార్క్ టైమ్స్‌లో కశ్మీర్ జర్నలిస్ట్ బషారత్ పీర్ ఒక ఆర్టికల్ రాశాడు. ఒక మిత్రుడి సమాధి పక్కన కూచుని ఉన్న మరో మిత్రుడి ఫొటో వేసి. ‘టేకింగ్ అమృత్ హోమ్’ అనే ఆ ఆర్టికల్ కోవిడ్ కాలంలో సూరత్ ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న ఇద్దరు మిత్రులు ఉత్తర్ ప్రదేశ్‌లోని తమ సొంత ఊరుకు బయలుదేరి ఎలా సర్వం కోల్పోయారో, వారిలో ఒక మిత్రుడు చనిపోతే మరో మిత్రుడు కోవిడ్‌కు భయపడకుండా ఆ శవాన్ని ఎలా ఇంటికి చేర్చాడో బషారత్ ఆ ఆర్టికల్‌లో రాశాడు. అది చదివిన నీరజ్ కోవిడ్ సమయాన్ని నేపథ్యంగా ఉంచుతూనే ఈ దేశంలో వ్యాపించిన సామాజిక దుర్నీతులను ముందు వరుసలో పెట్టి ‘హోమ్‌బౌండ్’ను తీశాడు.


