అఖిల్ అక్కినేని సినిమా ఏజెంట్ నష్టాల గురించి నిర్మాత అనిల్ సుంకర మరోసారి రియాక్ట్ అయ్యారు. శర్వానంద్ (Sharwanand) హీరోగా అనిల్ సుంకర నిర్మించిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఆరోజు సాయింత్రం 5:49 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ మూవీకి సామజవరగమన ఫేమ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా అనిల్ సుంకర తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏజెంట్ సినిమాతో పాటు అఖిల్ కెరీర్ గురించి మాట్లాడారు.
'ఏజెంట్ సినిమా వల్ల మేము అందరం నష్టపోయాం. ముఖ్యంగా అఖిల్, దర్శకుడు సురేంద్ర రెడ్డి కెరీర్ పరంగా బాగా నష్టపోయారు. మూడేళ్లుగా వారికి సినిమాలు లేవు. నేను డబ్బుల పరంగా నష్టాలు ఎదుర్కొన్నాను. ఈ దెబ్బ బయ్యర్ల మీద కూడా పడింది. అయితే, అఖిల్‌కు హిట్ ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది. నేను డబ్బులు మాత్రమే కోల్పోయాను. కానీ, అఖిల్ కెరీర్ ఏజెంట్ సినిమాతో దెబ్బతినింది. అదొక్కటే బాధ నాలో ఉంది.
నాతో ఇప్పటికీ అఖిల్ టచ్‌లోనే ఉన్నాడు. తనతో ఒక సినిమా తీయాలని నేను చాలా కథలను పంపుతూనే ఉన్నాను. అయితే, భారీ బడ్జెట్‌తో వద్దని ఏదైనా తక్కువ బడ్జెట్‌తో ప్లాన్ చేయమని తను సలహా ఇస్తున్నాడు. ఎక్కువ బడ్జెట్ పెట్టి మరోసారి సాహసం వద్దని సూచిస్తున్నాడు. తను చాలా మంచి వ్యక్తి. తప్పకుండా ఒక మంచి సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాం.' అని ఆయన అన్నారు.
'ఏజెంట్' మూవీ ఫ్లాప్ తర్వాత సినిమాలకు పూర్తిగా బ్రేక్ తీసుకున్న అఖిల్.. చాలా సైలెంట్‌గా 'లెనిన్' షూటింగ్ చేస్తూ వచ్చాడు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌కు మంచి ఆదరణ దక్కింది. ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తుంది. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకుడు. రాయలసీయ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీశారు. మే 01న 'లెనిన్' థియేటర్లలోకి రానుంది.


