
కాంతార చాప్టర్-1 సినిమా చూసిన వారందరూ నటుడు రాకేశ్ పూజారి (34) (Rakesh Poojary) గురించి ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే, ఆయన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మరణించారు. దీంతో చిత్ర యూనిట్ కూడా ఆ సమయంలో సంతాపం తెలిపింది.
ఈ ఏడాది మే 13న రాకేశ్ పూజారి గుండెపోటుతో మరణించారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో తన సన్నిహితులు నిర్వహించిన ఓ మెహందీ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అక్కడ డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రిలో చేర్పించేలోపే ఆయన మరణించారు. కన్నడలో ప్రముఖ టెవిలిజన్ షో ‘కామెడీ ఖిలాడిగలు’ సీజన్ 3 విన్నర్‌గా ఆయన నిలిచాడు. దీంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్‌కు చాలా సినిమా ఛాన్సులు దక్కాయి. కన్నడ, తుళు భాషల్లోని పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. అయితే, ‘కాంతార చాప్టర్-1’లో తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాతే ఆయన మరణించారు. ఇప్పుడు ఈ సినిమా చూసిన వారికి రాకేశ్ పూజారి పాత్ర గుర్తిండిపోయేలా ఉండటంతో అతని గురించి ఆరా తీస్తున్నారు. అయితే, రాకేశ్ పూజారి పాత్రకు తెలుగు వాయిస్ డబ్బింగ్ కమెడియన్ బబ్లూ చెప్పారు.
కాంతార చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న విడుదలైంది. కేవలం నాలుగురోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల జాబితాలో ఈ చిత్రం చోటు సంపాదించుకుంది. స్వీయ దర్శకత్వంలో రిషబ్‌శెట్టి హీరోగా నటించగా.. రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలలో కనిపించారు.